అమరావతి: ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూప‌క‌ల్ప‌న చేసిన అమ్మ ఒడి ప‌థ‌కం అమ‌లు చేసేందుకు వైసీపీ ప్ర‌భుత్వం అప్పుల వేట‌ను కొనసాగిస్తోంది. ఇదే అదునుగా భావంచిన బ్యాంకులు సైతం వ‌డ్డీ రేట్ల‌ను అమాంతం పెంచి చూపుతున్నాయి. దీంతో బ్యాంకులు నిర్ణ‌యించిన వ‌డ్డీరేట్ల‌కు అప్పు తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి జ‌గ‌న్ స‌ర్కార్‌ది. చివ‌ర‌కు 8.5 శాతం వ‌డ్డీతో రూ.1500 కోట్లు అప్పుగా ఇచ్చేందుకు ఆంధ్రా బ్యాంక్ ముందుకు వ‌చ్చింది. అంతమేర వ‌డ్డీ నిర్ణ‌యించినా ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా చెల్లించేందుకు ఆర్థిక‌శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌కు కొన్ని విద్యుత్ ఉత్ప‌త్తి ప్రాజెక్టుల‌ను బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. వాటిని బ్యాంకుల ముందు పీఎఫ్‌సీ ఆస్తులుగా చూపి, రూ.10వేల కోట్ల రుణం తీసుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. అలా పీఎఫ్‌సీ ఆస్తులుగా విద్యుత్ ఉత్ప‌త్తి ప్రాజెక్టుల‌ను చూసే రూ.1500 కోట్లు అప్పుగా ఇచ్చేందుకు ఆంధ్రా బ్యాంకు ముందుకు వ‌చ్చిన‌ట్టు రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం. అమ్మ ఒడి ప‌థ‌కానికి పూర్తి స్థాయి నిధులు స‌మ‌కూర్చే ప‌నిలో భాగంగా మ‌రో రూ.3వేల కోట్ల అప్పు కోసం ఆర్థిక‌శాఖ మ‌రో బ్యాంకును సంప్ర‌దించింద‌ని, అందుకు సంబంధించిన ఒప్పందం ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తుంది.

ఇలా అమ్మ ఒడితోపాటు, రైతు భ‌రోసా రెండో విడ‌త చెల్లింపుల‌కు గ‌డువు ముంచుకొస్తుండ‌టంతో ప్ర‌భుత్వం ఆలోచ‌న‌లో ప‌డింద‌ని, దీంతో చేసేది లేక బ్యాంకు ఉంచిన డిమాండ్‌లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు ఆర్థికశాఖ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా జ‌గ‌న్ స‌ర్కార్ అమ్మ ఒడి ప‌థ‌కానికి రూ.6వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతుంద‌ని, ఇక రైతు భ‌రోసా రెండో విడ‌త చెల్లింపుల‌కు రూ.2,500 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. అంతేకాక‌, ఇత‌ర ఖ‌ర్చుల కోస‌మంటూ మ‌రో రూ.10వేలు. ఇలా ఈ మొత్తాల‌ను బ్యాంకుల నుంచి రుణంగా పొందేందుకు ఆర్థికశాఖ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది.

గ‌తంలో ఓడి ( ఓవ‌ర్ డ్రాఫ్ట్‌) తీసుకునేందుకు వెక‌నుకంజ వేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అది త‌ప్ప‌డం లేదు. ఓవ‌ర్ డ్రాఫ్ట్‌కు మించి వ‌డ్డీని చెల్లించేందుకు ఆర్థిక‌శాఖ సిద్ధ‌ప‌డుతుండ‌టం విశేషం. ఈ లెక్క‌న బ్యాంకుల రెపో రేటుపై ఆర్థిక‌శాఖ 2శాతం వ‌డ్డీని చెల్లించాల్సి ఉంటుంది. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గ‌త ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేలం వేసింది. ఈ వేలం ద్వారా 29వేల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను రుణాల రూపంలో సేక‌రించింది. అధికారిక స‌మాచారం మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి 3,300 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను బ‌హిరంగ మార్కెట్ నుంచి సేక‌రించే అవ‌కాశం ఉంది. కాగా, ప్ర‌స్తుత ఆర్థిక కమిష‌న్‌కు ఇదే చివ‌రి సంవ‌త్స‌రం క‌నుక ప్ర‌భుత్వానికి బ‌హిరంగ మార్కెట్‌ల నుంచి నిధులు సేక‌రించే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్రం దృష్టి..

మ‌రోప‌క్క‌, కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ లెక్క‌ల‌పై దృష్టి సారించింద‌ని, అందులో భాగంగానే టీడీపీ హ‌యాంలో చేసిన అప్పులు ఏ మేర ఉన్నాయ‌న్న అంశాలను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తుంది. ఆ అప్పులు కేంద్రం లెక్కిస్తున్న జీడీపీలో 3 శాతానికి మించితే గ‌నుక జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని, మ‌రీ ముఖ్యంగా చివ‌రి త్రైమాసికంలో బ‌య‌టి నుంచి అప్పులు తెచ్చుకునే అవ‌కాశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోల్పోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇలా నిధులు రాబ‌ట్టేందుకు ఉన్న అవ‌కాశాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి సారించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.