యశోద ఆస్పత్రిలో దారుణం.. బతికిఉండగానే చనిపోయాడు అని చెప్పి
By తోట వంశీ కుమార్ Published on 9 July 2020 4:40 PM ISTకరోనా మహమ్మారి రాష్ట్రంలో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే.. లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఇలాంటి ఘటనలు బయటికి వచ్చాయి. ఇక రోగుల రికార్డులు సరిగ్గా ఉండడం లేదు. ఒకరి మృతదేహాన్ని మరొకరికి అప్పగించిన ఘటనలు ఉన్నాయి. తాజాగా మరో దురాగతం బయటికి వచ్చింది. అయితే.. బతికి ఉన్న మనిషిని చనిపోయాడని చెప్పి మరో 5లక్షల చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పారు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. చనిపోలేదని, బతికే ఉన్నాడని తెలిసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. అంబర్‌పేట్‌కు చెందిన సి.నరసింగరావుకు ఇటీవల కరోనా సోకడంతో.. చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరాడు. 10 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు 8లక్షలకు పైగా బిల్లు కట్టారు. కాగా.. బుధవారం అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యశోద యాజమాన్యం నరసింగరావు మృతి చెందాడని చెప్పారు. మరో రూ.5లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయగా.. ఆయన బతికే ఉన్నాడని తెలిసింది. వీడియో కాల్‌లో ఆయనతో మాట్లాడారు. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు ఆయన కుటుంబ సభ్యులు. ఇదేంటని ప్రశ్నిస్తే మీకు ఎవరు చెప్పారని తిరిగి ప్రశ్నిస్తున్నారని, యశోద ఆస్పత్రి సిబ్బంది మమ్మల్ని మానసిక వేధనకు గురిచేశారని వారు ఆరోపిస్తున్నారు.