వెండితెరపై పెను సంచలనం.. కేజీఎఫ్.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 17 July 2020 12:04 PM ISTకేజీఎఫ్-సినీ పరిశ్రమే కాదు భారతీయ ప్రేక్షకులందరూ చర్చించుకునే ఓ సంచలన చిత్రం. బాహుబలి తర్వాత ఆ స్థాయిని అందుకోగలిగిన అద్భుత చిత్రం ఇది. కన్నడ యువనటుడు యష్ హీరోగా నటించిన ఈ చిత్రం తెరకెక్కిన ఒక్క రోజులోనే ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. అప్పటి దాకా కన్నడ హీరోగా ప్రాంతీయ ముసుగులో ఉన్న యష్ పండిట్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నిర్మాతల అంచనాలకు అందనంత అనూహ్య విజయాన్ని కేజీఎఫ్ సొంతం చేసుకుంది. తెలుగు,తమిళంలో ఈ సినిమా డబ్ చేసి విడుదల చేస్తే అక్కడా ఇంతే సంచలనం. ఇప్పుడు తాజాగా సీక్వెల్ గా కేజీఎఫ్-2 చిత్రం నిర్మితమయింది. ఇదెంత సంచలనం సృష్టిస్తుందో అని సినీ విశ్లేషక పండితులు లెక్కలేస్తున్నారు. గొప్ప అంచనాలు ఏవీ లేకుండా డెడికేటెడ్ గా తీసిన ఓ ప్రాంతీయ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం చూస్తుంటే మంచి చిత్రాలకు కాలం చెల్లలేదని అనిపిస్తుంది.
బాహుబలి చిత్రం వచ్చాక భారతీయ సినీ పరిశ్రమ ఆలోచనలే మారిపోయాయి. ఈ భారీ చిత్రం తెరపై కనిపించి అద్భుత విజయం సాధించడంతో అప్పటి దాకా హిందీ సినిమా-ఇతర ప్రాంతీయ సినిమాల మధ్య ఉన్న అంతరం తగ్గిపోయింది. విభజన రేఖ చెదిరిపోయింది. ప్రాంతీయ భాషా చిత్రాల సత్తా ఏంటో బాహుబలి వెండితెర సాక్షిగా నిరూపించింది. ఆ చిత్రం నిర్మాణ వ్యయానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. బాహుబలి-2 కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ రెండు భాగాల బాహుబలి తెలుగు సినీ పరిశ్రమనే కాదు భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ సినీరంగంలో తలెత్తుకుని తిరిగేలా చేసింది. ఆ సినిమా హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మెరిసిపోయాడు. తర్వాత ఆ చరిత్రను మళ్లీ పునరావృతం చేసేలా కేజీఎఫ్ కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది. కనీవినీ ఎరుగని ఈ విజయం చిత్ర బృందంలో సరికొత్త హుషారును పుట్టించింది. ఇక ఈ సినిమాలో రాకీగా పాత్రకు జీవం పోసిన హీరో యష్ పాన్ ఇండియా హీరోల జాబితాలో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.
2018లో కేజీఎఫ్ చిత్రం విడుదల అయినపుడు ప్రేక్షకులకు కిర్రెక్కించే కిక్‌తో ఊగిపోయారు. సినిమాను గుండెకు హత్తుకున్నారు. సరిగ్గా నిర్మిస్తే ఒక్క సినిమా చాలు తన సత్తా ఏంటో చూపడానికి అనేలా కేజీఎఫ్ టపటపా ఇతర దక్షిణ భాషల్లో డబ్ అయింది. రీమేక్ సినిమా కన్నా ఎక్కువగా ప్రేక్షకులు డబ్ సినిమాను ఆదరించారు. కథ.. కథనం గట్టిగా ఉండి నటులు జీవం పోయగలిగితే చాలు సగటు ప్రేక్షకుడు అంతకన్నా ఎక్కువ ఏం ఆశించడు. భాష, ప్రాంతాలకు అతీతంగా దాన్ని విజయవంతం చేస్తాడు అని కేజీఎఫ్ చిత్రం నిరూపించింది. కరోనా ప్రభావంతో దేశమంతటా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేజీఎఫ్ ఓటీటీలోనూ అదరగొట్టేసింది.
కేజీఎఫ్ ను మించి కేజీఎఫ్-2:
కేజీఎఫ్ ఇచ్చిన సక్సస్ కిక్ తో సీక్వెల్ గా నిర్మిస్తున్న కేజీఎఫ్-2 తొలి చిత్రం కన్నా వందరెట్లు బాగుంటుందని గత కలెక్షన్లను చరిత్రను కచ్చితంగా బ్రేక్ చేస్తుందని సినిమా నిర్మాత, దర్శకుడు ఢంకా బజాయించి చెబుతున్నారు. కేజీఎఫ్ లో గోల్డ్ మైన్ చుట్టూ కథ తిరిగితే రెండో సినిమా కథ, కథనం సిటీ దాకా విస్తరించినట్టు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫాంలో విజయదుందుభి మోగించిన కేజీఎఫ్ ని చూశాక ప్రేక్షకులు కేజీఎఫ్-2 పై భారీ అంచనాలు పెంచేసుకున్నారు.
కేజీఎఫ్-2 సినిమా అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రానుంది. సినిమా బృందం ఈ సినిమా కథ కోలార్ గోల్డ్ మైన్స్ నుంచి సిటీ ప్రాంతానికి విస్తరిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాదు నిర్మాణ వ్యయం కూడా మొదటి సినిమా కంటే అధికంగా ఉంటుందని వివరించింది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ తారలు సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని , దాదాపు 10 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వివరాలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
తొలి కేజీఎఫ్ లో రాకీగా కనిపించిన యష్ ఈ సినిమాలో ఇంకా ఏం కొత్త మ్యాజిక్ చూపించబోతున్నాడో అని ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. అలాగే ఈ సినిమా ప్రదర్శన హక్కులు సొంతం చేసుకోడానికి బడా బడా ఓటీటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కేజీఎఫ్-2ను లాక్ డౌన్ ఉన్నా సరే విడుదల చేయడానికి హీరో తన చిత్ర బృందంతో కసరత్తులు చేస్తున్నాడు. మొదటి చిత్రం కన్నా అన్ని విధాల కొత్త హంగులతో తీసుకు రావడానికి శ్రమిస్తున్నాడు. సో కేజీఎఫ్-2 లో రాకీగా యష్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే అభిమానులు కొన్నాళ్లు ఆగాల్సిందే!!