ముఖ్యాంశాలు

  • కర్నాటకలో ఆడియో టేపుల కలకలం
  • యడ్డీ ఆడియో అంటూ బయటకు వచ్చిన టేప్
  • అమిత్ షా సూచనల మేరకే ఆపరేషన్ అన్న వాయిస్
  • బీజేపీపై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు
  • అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేసిన సిద్దరామయ్య

ఆడియో అగ్గి రాజేసింది. మాటలు మంటలు రేపుతున్నాయి. కర్ణాటకలో లేటెస్ట్ పొలిటికల్‌ సీన్ ఇది. ఆపరేషన్ కమల్ అటు తిరిగి ఇటు తిరిగే బీజేపీకి చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్పకు సంబంధించినదిగా చెబుతున్న ఆడియో టేపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకే ఆపరేషన్ కమల్ సాగిందని యడియూరప్ప పేర్కొన్నా రు. హుబ్బళ్లిల్లో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ మీటింగ్‌లో యడియూరప్ప సహా సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమయంలో ఆపరేషన్ కమల్, ఎమ్మెల్యేల రాజీనామా గురించి యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా సూచనల మేరకే ఆపరేషన్ కమల్‌ జరిగిందని యడ్డీ చెప్పుకొచ్చారు. తాను చెప్పడం వల్లే 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఈ మాటలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. మరీ ముఖ్యంగా అమిత్ షాకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.

యడియూరప్పదిగా భావిస్తున్న ఆడియో టేపు కాంగ్రెస్ పార్టీకి బలమైన అస్త్రంగా మారింది. బీజేపీ సర్కారును ఇరుకున పెట్టడానికి హస్తం నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ కమల్‌ గురించి తామెప్పటి నుంచో చెబుతున్నామని, ఇన్నాళ్లకు యడ్డీ నోటి నుంచే ఆ నిజం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అమిత్ షా తన పదవి కి రాజీనామా చేయాలని మాజీ సీఎం సిద్ధరామ య్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేంద్ర హోంమంత్రే కుట్ర పన్నడం దారుణమని విమర్శించారు.

ఆపరేషన్ కమల్-యడియూరప్ప ఆడియో టేప్‌ను అంత ఈజీగా వదిలిపెట్టకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. రాష్ట్రపతి, సుప్రీంకోర్టుల దృష్టికి ఆడియో టేప్‌ను తీసుకెళ్లాలని తీర్మానించింది.అమిత్ షాపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటం చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, సీనియర్ నాయకుడు ఉగ్రప్పతో ప్రత్యేకంగా చర్చ లు జరిపారు.

సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పార్టీ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతోనూ చర్చించారు. ఉపసమరానికి కొన్ని రోజులముందు ముఖ్యమంత్రి యడియూరప్ప ఆడియో ద్వారా అడ్డంగా బుక్కయ్యారు. గతంలో కూడా యడ్డీ ఇలాగే దొరికిపోయారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేతో డీల్‌లో బెడిసికొట్టి ఆడియోతో అభాసుపాలయ్యారు. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఆడియో వివాదం ఎలాంటి మరుపు తిరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే, ఆడియో టేప్ లీక్ కావడం యడియూరప్ప ప్రత్యర్థుల పనే అని మంత్రులు భావిస్తున్నారు. కోర్‌కమిటీలో మాట్లాడిన అంశాలు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆంతరంగిక విషయాలను రికా ర్డ్ చేసి లీక్ చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.