20 లక్షలు దాటిన కరోనా కేసులు

By రాణి  Published on  16 April 2020 10:18 AM GMT
20 లక్షలు దాటిన కరోనా కేసులు

ముఖ్యాంశాలు

  • అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న రాకాసి వైరస్
  • అమెరికా మినహా నాలుగు దేశాల్లో లక్షకు పైగా కేసులు

ప్రపంచ దేశాలన్నింటిలోనూ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజు కేసుల సంఖ్య తగ్గుతోంది కదా..ఇక కరోనా నుంచి నెమ్మదిగా బయటపడుతాం అని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే..మీరు అంత మనశ్శాంతిగా ఉండటం నాకిష్టం లేదన్నట్లు ప్రవర్తిస్తోంది ఈ రాకాసి వైరస్. డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందితో పాటు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సైతం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో వైపు భారత్ లో ఉన్న గబ్బిలాల్లో కూడా కరోనా వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు పరిశోధన చేసిమరీ నిర్థారించారు. గురువారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయాయి. కరోనా వల్ల కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నా కనీసం ముట్టుకోలేని విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20,64,815 కి పెరగగా 5,12,252 మంది కోలుకున్నారు. మరో 1,38,078 మంది కరోనా తో మృతి చెందారు. అత్యధికంగా అగ్రరాజ్యంలో 6,44,188 కరోనా కేసుల సంఖ్య నమోదైంది. వీరిలో 52,629 మంది కోలుకోగా..మృతుల సంఖ్య 28,579కి పెరిగింది. అమెరికా తర్వాత వరుసగా స్పెయిన్, జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్ దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ లో 1,80,659 కేసులు నమోదవ్వగా 70,653 మంది కోలుకున్నారు. మరో 18,812 మంది మృతి చెందారు. అంటే ఈ దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 90 వేలకు పైనే. ఇక ఇటలీలో 1,65,155 కేసులు నమోదవ్వగా 38,092 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 21,645 గా ఉంది.

జర్మనీలో కూడా కరోనా కేసులు లక్ష దాటాయి. 1,34,753 కేసులకు గాను 66,169 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. మృతుల సంఖ్య 3,804గా నమోదైంది. ఫ్రాన్స్ లో 1,06,206 కేసులు నమోదవ్వగా 30,955 బాధితులు కోలుకున్నారు. 17,167గా ఉంది. ఏదేమైనా అత్యధిక కేసులు, అత్యధిక మరణాలతో అగ్రరాజ్యం అతలాకుతలమవుతుంది. ఇది చాలదన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అర్థంతరంగా నిధులు నిలిపివేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ ఇలా చేయడం సరికాదని రష్యా, యూరప్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు సైతం ఆరోపిస్తున్నాయి. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 12 వేలు దాటగా మృతుల సంఖ్య 414 కు పెరిగింది.

Also Read : ఆఖరికి మెగాస్టార్ కు కూడా ఇంటి పనుల కష్టాలు

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. మిగతా ఉద్యోగులకు సైతం ఇచ్చే జీతాల్లో భారీగా కోత విధిస్తున్నాయి వివిధ కంపెనీలు. ఆ రంగం, ఈ రంగం అన్న తేడా లేదు. సాఫ్ట్ వేర్ సంస్థలు సైతం ప్రాజెక్టులు లేక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఇలాగే ఇంకా నెలరోజులు కొనసాగితే మాత్రం ఆకలి చావులు తప్పవన్న సంకేతాలొస్తున్నాయి. అన్ని దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోపూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయగా..మళ్లీ అక్కడ వైరస్ భయం పట్టుకుంది. రెండ్రోజుల క్రితం కొత్తగా 40 కేసులు నమోదవ్వడం చైనాను కలవరపెడుతోంది.

కరోనా వల్ల వలస కార్మికులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇళ్లకు వెళ్లలేక ఉన్న చోట ఉపాధి లేక, తిండి లేక అన్నంపెట్టే నాథుడి కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది కాలి నడకనే స్వగ్రాామాలకు చేరుకుంటుండగా..వారిని స్థానిక అధికారులు క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న ఆశతో ముంబైలోని బాంద్రాలో రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్దకు వేల సంఖ్యలో వలస కార్మికులు గుమిగూడారు. కానీ అదేరోజు లాక్ డౌన్ గడువు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో పోలీసులు వలస కూలీలపై లాఠీ చార్జి చేశారు.

Also Read : కరోనా గురించి ఆగష్టులో చెప్పాడు.. ఎప్పుడు తగ్గుతుందో కూడా చెబుతున్నాడు..!

మరోవైపు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ‌శ్మాన వాటిక‌లో ఎవరో కుళ్లిపోయిన అరటిపండ్లను పారేసిపోయారు. ఇది తెలిసిన వలస కార్మికులు అక్కడికెళ్లి వాటిలో మంచిగా ఉన్న అరటిపండ్లను ఏరుకుని తిన్నారు. మిగిలినవి బ్యాగుల్లో నింపుకున్నారు. పనులు లేవు. తిండి పెట్టేవారు లేరు. ఇక ఇలాంటి సమయంలో వేరే గత్యంతరం లేక దొరికిందే శరణ్యం అనుకుంటున్నారు. ఇది చూసిన కొందరు ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని దేవుడిని వేడుకుంటున్నారు. ఏదేమైనా గానీ కరోనా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఒక్క భారత్ లోనే గడిచిన 21 రోజుల్లో 203 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటే..ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎంత నష్టం వాటిల్లి ఉంటుందో ఆలోచించండి. #stayhomestaysafe

Next Story