ఒక్క రోజే లక్షా యాభైవేల కేసులు..
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2020 12:59 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 87లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడగా.. 4.6లక్షల మంది మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాప్తి మొదలైన తొలి దశలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. అయితే.. లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక స్థితి దెబ్బతింటుండడంతో కొన్ని దేశాలు లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేయగా.. మరికొన్ని దేశాలు సడలింపులు ఇచ్చాయి. దీంతో ఈ మహమ్మారి విజృంభణ అధికమైంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున లక్ష చొప్పున కేసులు నమోదు అవుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచం కొత్త ప్రమాదకర దశలోకి జారుకుందని హెచ్చరించింది. గురువారం ఒక్క రోజే లక్షా యాభైవేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఈ కేసుల్లో సగానికి పైగా అమెరికాలోనివే. శుక్రవారం డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడారు. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.
ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి.. ఇప్పడికిప్పుడు అందుబాటులోకి రాదన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు విసిగిపోయారని, చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థల్ని తెరిచే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
22లక్షలకు పైగా కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్(10లక్షలు), రష్యా(5.6లక్షలు) స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్ కూడా 4వ స్థానంలో ఉంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,516 కేసులు నమోదు కాగా.. 375 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,048కి చేరుకుంది.