టన్నుల లెక్కన బంగారాన్ని నిల్వ చేసే టాప్ దేశాలివే..!
By సుభాష్ Published on 19 Aug 2020 4:48 AM GMTడబ్బులు చేతి నిండా ఉన్నాయనుకోండి తొలుత ఏం చేస్తాం. ఇంట్లో వారికి అవసరమైన బంగారాన్ని కొంటాం. తర్వాత.. ఇళ్లు.. భూములు కొనేస్తాం. అంతేకానీ.. ఉన్న డబ్బులన్నింటిని నగదు రూపంలో అదే పనిగా ఉంచేయం. వ్యక్తులుగా మనం ఇలా చేస్తే.. ప్రభుత్వాలు తమ వద్ద ఉండే ఆదాయాన్ని ఏం చేస్తుంటాయి? అన్నది ప్రశ్న. దీనికి సమాధాం వెతికితే ఆసక్తికర సమాధానం లభిస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాలు వీలైనంతవరకు అమెరికా డాలర్లను భారీగా కొనుగోలు చేస్తుంటుంది. ఒక మోతాదు దాటిన తర్వాత నుంచి డాలర్లనుకొనుగోలు చేయటం ఆపేసి.. బంగారాన్ని భారీగా కొనటం షురూ చేస్తుంటుంది.
దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. విపక్షాలు.. మేధావులు పలువురు తరచూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ తరహా వ్యాఖ్యలు వినిపిస్తుంటే..మరోవైపు దేశ ఆర్థిక నిల్వలు.. బంగారు నిల్వలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చెబుతున్నా.. మోడీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఒక ప్రముఖ బిజినెస్ వార్తల్ని అందించే మీడియా సంస్థ ప్రచురించిన ఒక వ్యాసం ఆసక్తికరంగా మారింది. తాజాగా మోడీ సర్కారు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వల్లో ఏడు శాతం భారత్ సర్కారు వద్ద ఉంటే.. తాజాగా దాన్ని మరో మూడు శాతానికి పెంచుకునేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం విశేషం.
సాధారణంగా ఆర్ బీఐ (భారత రిజర్వు బ్యాంకు) తన వద్ద ఉన్న నిల్వల్ని పెంచుకోవటానికి అయితే అమెరికా డాలర్లు.. లేదంటే బంగారు నిల్వల్ని కొనుగోలు చేస్తాయి. ఇప్పటికే మన దగ్గర 538 బిలియన్ అమెరికా డాలర్లు ఉన్నాయి. ఇంత భారీగా నిల్వలు ఇటీవల కాలంలోనే ఉన్నాయని చెబుతున్నారు. మన అవసరాలకు తగినంత స్థాయిలో డాలర్లు ఉండటంతో ఇప్పుడు ఫోకస్ బంగారాన్ని కొనుగోలు చేయటం మీద పెట్టినట్లు చెబుతున్నారు.
ఓపక్క కరోనా సంక్షోభ సమయంలోనూ భారీగా బంగారాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని భారత సర్కారు తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. రానున్న కొద్ది నెలల పాటు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండనుందన్న అంచనాల నేపథ్యంలో బంగారు నిల్వలు పెంచుకుంటే మేలు చేస్తాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ప్రపంచంలోని పలు దేశాల్లో బంగారునిల్వల్ని భారీగా నిల్వ ఉంచి టాప్ టెన్ దేశాల్లో భారత్ ఒకటిగా నిలవటం గమనార్హం.
ఏ దేశం ఎంత భారీగా బంగారు నిల్వల్ని ఉంచుకున్నాయన్నది ఆసక్తికరం. ఆ లెక్కల్లోకి వెళితే..
దేశం బంగారం (టన్నుల్లో)
1. అమెరికా 8133.5
2. జర్మనీ 3363.6
3. ఇటలీ 2451.8
4. ఫ్రాన్స్ 2436.0
5. రష్యా 2299.9
6. చైనా 1948.3
7. స్విట్జర్లాండ్ 1040.0
8. జపాన్ 765.2
9. భారత్ 657.7
10. నెదర్లాండ్స్ 612.5