ఫైనల్‌కు రెడీ అవుతోన్న భారత్.. ఆ రెండు విషయాల్లో జాగ్రత్త అవసరం
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 5:14 AM GMTఫైనల్‌కు రెడీ అవుతోన్న భారత్.. ఆ రెండు విషయాల్లో జాగ్రత్త అవసరం
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా ఉన్న టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి చూడకుండా ఫైనల్ వరకు చేరుకుంది. అయితే.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది భారత్. ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011 తర్వాత వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుస్తుందని అభిమానులు దీమాగా ఉన్నారు. ఎందుకంటే భారత్ జట్టు ఉన్న ఫామ్ అలాంటిది మరి. ఏ చిన్న పొరపాటు చేయకుండా ఈ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. కానీ.. చివరి రెండు మ్యాచుల్లో మాత్రం భారత ఆటగాళ్ల నుంచి వచ్చిన ప్రదర్శనలో రెండు విషయాలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ వన్డే వరల్డ్ కప్‌లో ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో భారత్ అదరగొడుతోంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థి బౌలర్లలో దడపుట్టిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్‌గా దిగుతోన్న కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పెద్దగా పట్టించుకోవడం లేదు. జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నాడు. కొద్ది ఓవర్లే ఆడినా మంచి ఆరంభాన్ని ఇస్తూ.. బౌలర్ల ఆలోచనలను దెబ్బతీస్తున్నాడు. అంతేకాదు.. శుభ్‌మన్ గిల్ కూడా తన వంతుగా పరుగులు చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు శ్రేయాస్ కూడా స్పిన్నర్స్‌పై విరుచుకుపడుతూ ఇప్పటికే రెండు సెంచరీలను నమోదు చేసుకున్నాడు. అంతేకాదు.. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన ఏ మ్యాచ్‌లోనూ భారత్ ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. అన్నింట్లోనూ విజయాలు నమోదు చేసుకుంది.
ఆడిన పది మ్యాచుల్లో ఐదు చేజింగ్‌లు.. ఐదు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది భారత్. దాంతో.. టాస్ కేవలం భారత్‌కు నామమాత్రంగానే మారింది. ఎలా దిగినా టీమిండియా రాణిస్తోంది. కేవలం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే పదో వికెట్ వరకు బ్యాటింగ్ వెళ్లింది. ఆరు మ్యాచుల్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లే చూసుకున్నారు. కోహ్లీ (711), రోహిత్ (550), శ్రేయస్ (526), రాహుల్ (386), గిల్ (346) భీకర ఫామ్‌లో ఉన్నారు.
ఇటు బౌలర్లు కూడా ప్రత్యర్థులకు అర్థం కాని రీతిలో రాణిస్తున్నారు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 96 వికెట్లను మన బౌలర్లు సాధించారంటే అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ మినహా.. ప్రతి జట్టును భారత్ ఆలౌట్ చేసింది. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లను పూర్తిగా కూల్చేశారు. టీమిండియాలో ముఖ్యంగా పేసర్ షమీ. ఇతను రాణిస్తోన్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో అయితే ఏకంగా ఏడు వికెట్లు తీసుకున్నాడు. రికార్డులను తిరగరాశాడు. ఇప్పటి వరకు ఈ ఒక్క టోర్నీలో ఐదు సార్లు 5 వికెట్స్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక బుమ్రా, సిరాజ్ కూడా మంచి స్పెల్‌తో డాట్ బాల్స్ వేస్తున్నారు. స్పిన్నర్స్ జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా వికెట్లు తీస్తూ బాల్‌ను తిప్పుతున్నారు. ఫైనల్‌లో తలపడుతున్న ఆస్ట్రేలియా.. లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు బలమైన బౌలింగ్ దళం ఆసీస్ బ్యాటర్లను 200లోపు స్కోరుకే పరిమితం చేశారు. ఇక ఫైనల్‌లో కూడా ఇదే పునరావృతం చేస్తే మాత్రం భారత్ గెలుపు ఖాయం అవుతుంది.
ఫైనల్‌కు ముందు భయపెడుతున్న ఫీల్డింగ్, ఎక్స్‌ట్రాలు
ఈ వరల్డ్ కప్‌లో భారత్ మొదటి ఎనిమిది మ్యాచుల్లో మంచి ఫీల్డింగ్‌నే కనబర్చింది. కోచ్ కూడా ప్రోత్సహిస్తూ బెస్ట్ ఫీల్డర్లకు అవార్డులను అందజేస్తూ వచ్చారు. దాంతో.. ఇది ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కానీ.. లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కొంత నిరాశపర్చింది టీమిండియా. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీసం 3 క్యాచ్‌లను వదిలేశారు. ఇక న్యూజిలాండ్ మ్యాచ్‌లో రోహిత్, షమి రెండు క్యాచ్‌లను వదిలేశారు. ఇది ఆసీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లో రిపీట్ అయితే.. ఓటమిని కొనితెచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే వారికి ఒకట్రెండు సార్లు లైఫ్ ఇస్తే చెలరేగిపోయి ఆడే అవకాశాలు లేకపోలేదు.
మరోవైపు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చుకుంది భారత్. కీలక మ్యాచ్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 ఓవర్లలో 25 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత కోలుకుని రాణించారు. షమీ వరుసగా వికెట్లు తీయడంతో ఒత్తిడి నుంచి బయటపడ్డారు. చివరకు మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరారు. అయితే.. మొత్తంగా మ్యాచ్ ముగిసే సరికి 29 పరుగులు అదనంగా ఇచ్చారు. ఒకవేళ ఇవి లభించకపోయి ఉంటే న్యూజిలాండ్ 300 స్కోరు దాటేది కాదు.