వరల్డ్ కప్‌లో టీమిండియా విజయాల సీక్రెట్ చెప్పిన కెప్టెన్ రోహిత్
వన్డే వరల్డ్ కప్-2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి టీమిండియా తమకు ఎదురెవ్వరూ లేరని నిరూపించింది.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 10:31 AM ISTవరల్డ్ కప్‌లో టీమిండియా విజయాల సీక్రెట్ చెప్పిన కెప్టెన్ రోహిత్
వన్డే వరల్డ్ కప్-2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి టీమిండియా తమకు ఎదురెవ్వరూ లేరని నిరూపించింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లీగ్ మ్యాచులు అన్నింట్లో గెలిచిన ఏకైక జట్టుగా నిలబడింది. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా వరుసగా 9 విజయాలు ఖాతాలో నమోదు అయ్యాయి. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లోనే కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు విజయాల సీక్రెట్‌ను చెప్పాడు. వరుసగా తాము ఎలా గెలిచారో.. ఆ సూత్రమేంటో చెప్పాడు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు అసలైన ట్రీట్‌ను అందించింది. నిర్ణీత 50 ఓవర్లలో 410 భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముంగిట పెట్టింది. ఏకంగా శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలు చేయగా.. రోహిత్, శుభ్‌మన్, విరాట్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 411 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టార్గెట్‌ను చేదించలేకపోయింది. 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దాంతో 160 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు కూడా తమ బౌలింగ్ టాలెంట్‌ను చూపించారు. విరాట్, రోహిత్ ఏకంగా చెరో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమిండియా సక్సెస్ సీక్రెట్ ను తెలియజేశారు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి తాము ఒక్కో మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ రాణించామని చెప్పాడు. ఇది సుదీర్ఘ టోర్నీ అయినందుకు ఎప్పుడూ ఎక్కువ దూరం ఆలోచించాలని అనుకోలేదన్నాడు. ఒక్కో మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ చేసి గెలుచుకుంటూ వచ్చామని చెప్పాడు కెప్టెన్ రోహిత్. వేర్వేరు వేదికలు, విభిన్న పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉందనే విషయాన్ని గ్రహించామనీ.. అందుకు అనుగుణంగా ఆడుతున్నట్లు చెప్పాడు. తొమ్మిది మ్యాచుల్లో టీమ్ కనబర్చిన తీరు తనని ఎంతో సంతోషపెట్టిందని చెప్పాడు. ప్రతి ఒక్కరు విజయం కోసం తమ వంతు కృషి చేశారని చెప్పాడు. భారతదేశ పరిస్థితులు తెలిసినప్పటికీ.. విభిన్న టీమ్‌లతో ఆడినప్పుడు భిన్నమైన సవాళ్లు ఏర్పడతాయని చెప్పాడు. ఆ పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకుని.. చక్కగా అందిపుచ్చుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో చేజింగ్ చేసి గెలిచామని.. ఆ తర్వాత పేసర్లు, స్పిన్నర్లు కలిసి సత్తా చాటారని రోహిత్ అన్నాడు. మైదానంలో ఉత్సాహంగా ఉండాలని అనుకున్నామన్నాడు. భారత్ ఆడుతున్నప్పుడు అంచనాలు భారీగా ఉంటాయని తెలుసు కానీ.. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి మొత్తం ఎఫెర్ట్ పెట్టి ఆడినట్లు చెప్పాడు రోహిత్ శర్మ. మొత్తానికి టీమ్ సమిష్టిగా రాణిస్తోందని చెప్పాడు.