వరల్డ్‌ కప్‌లో IND Vs AUS మ్యాచ్‌లు.. ఎవరెన్ని గెలిచారంటే..

భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది.

By Srikanth Gundamalla  Published on  17 Nov 2023 4:26 PM IST
world cup-2023, india, australia, cricket,

వరల్డ్‌ కప్‌లో IND Vs AUS మ్యాచ్‌లు.. ఎవరెన్ని గెలిచారంటే.. 

భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో హాట్‌ ఫేవరెట్‌గా ఉన్న టీమిండియా ఒక్క ఓటమి లేకుండా ఫైనల్‌ వరకు చేరింది. ఇక మరో ఫైనలిస్ట్‌ ఆస్ట్రేలియా సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో టీమిండియాతో తలపడేందుకు సిద్ధం అవుతోంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హైవోల్టేజ్‌ మ్యాజ్‌ జరగనుంది.

స్వదేశంలో జరుగుతోన్న వరల్డ్ కప్‌ టోర్నీని గెలవాలని టీమిండియా ఆశగా ఉంది. మరోవైపు వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఎనిమిదో సారి ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా మరో చారిత్రాత్మక విజయం కోసం ప్రయత్నాలు చేయనుంది. 2023 వరకు పలు దశల్లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయి.. ఎవరెన్ని గెలిచారో ఒకసారి వివరాలు చూసేద్దాం...

2023 వరల్డ్ కప్ లీగ్ దశ:

2023 వరల్డ్ కప్ లీగ్ దశలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దాటికి కేవలం 199 పరుగులే చేశారు. 200 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97) పరుగుల చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

2019 వరల్డ్‌ కప్‌లో IND Vs AUS:

2019 వరల్డ్‌ కప్‌ ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. తొలి వికెట్‌కి 22.3 ఓవర్లలో 127 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభానిచ్చారు. శిఖర్ ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 316 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో అత్యధికంగా.. డేవిడ్ వార్నర్ 56, స్టీవ్‌స్మిత్ 69 పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.

2015 వరల్డ్‌ కప్‌లో IND Vs AUS:

వన్డే ప్రపంచకప్ 2015 టోర్నీ న్యూజిలాండ్ జరిగింది. సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సారథ్య బాధ్యతలు వహించారు. ఆ తర్వాత 329 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 233 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు 34, శిఖర్ ధావన్ 15, అజింక్య రహానే 44, కెప్టెన్ ధోని 65 పరుగులు చేశారు. టోర్నీలో సెమీ ఫైనల్ వరకు వచ్చిన ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. చివరకు ఆసీస్ జట్టు టోర్నీ గెలుచుకుంది.

2011 వరల్డ్‌ కప్‌లో IND Vs AUS:

2011 వరల్డ్ కప్ లో కూడా సెమీ ఫైనల్స్ లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. చేసింగ్‌కు దిగిన భారత్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. ఈ టోర్నీలో ఫైనల్ లో శ్రీలంకపై ఇండియా భారత్ ఘన విజయం సాధించింది.

2007 వరల్డ్‌ కప్‌లో IND Vs AUS:

2007 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో జరిగింది. ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో మధ్యలోనే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. 2007 వరల్డ్ కప్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

2003 వరల్డ్‌ కప్‌లో IND Vs AUS:

2003 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 10 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. యిఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ జట్టు ఒక వికెట్ కోల్పో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఆ తర్వాత ఇదే టోర్నీలో మరోసారి ఫైనల్ వరకు వెళ్లిన ఇరు జట్లు.. చివరలో ఆస్ట్రేలియా జట్టు ఇండియాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులతో శతకం సాధించారు. టీమిండియా తరఫున ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 47, యువరాజ్ సింగ్ 24, గంగూలీ 24 పరుగులు చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపొంది టోర్నీని సొంతం చేసుకుంది.

Next Story