వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు చీఫ్‌ గెస్ట్‌గా ప్రధాని మోదీ..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ప్రధాని మోదీ చీఫ్‌ గెస్టుగా వస్తున్నారట.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 2:08 PM GMT
world cup-2023, final, india, prime minister modi,

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు చీఫ్‌ గెస్ట్‌గా ప్రధాని మోదీ..!

భారత్‌ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ చివరి దశకు వచ్చేసింది. తొలి సెమీ ఫైనల్‌లో సత్తా చూపించిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాల పరంపరను కొనసాగించి ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆడిన భారత్‌.. ఆ జట్టుకు సరైన సమాధానం చెప్పినట్లు అయ్యింది. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ నెల 19వ తేదీన జరగనుంది.

ఈ సారి వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఎంతో మంది గెస్టులు వచ్చారు. ముఖ్యంగా బీసీసీఐ ప్రేక్షకులను అలరించేందుకు గాను కొందరు ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను అందించింది. సెమీ ఫైనల్‌ మ్యాచ్లో రజనీకాంత్‌ కనిపించారు. అలా ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒక స్టార్ కనబడుతూనే ఉన్నారు. అయితే.. ఈ నెల 19న జరగబోయే ప్రతిష్టాత్మక మ్యాచ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ఎవరు చీఫ్‌ గెస్టుగా వస్తారనే దానిపై ఓ వార్త వినిపిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ప్రధాని మోదీ చీఫ్‌ గెస్టుగా వస్తున్నారట.

చాలాకాలం తర్వాత భారత్‌ గడ్డపై జరుగుతున్న టోర్నీలో భారత్‌ కప్పు కొడుతుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ప్రధాని మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ మ్యాచ్‌ను పూర్తిగా తిలకించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ హాజరు అవుతుండటంతో.. క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు అటువైపు మళ్లింది. అందులోనూ ఆదివారం కావటంతో మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ మ్యాచ్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

క్రికెట్‌ మ్యాచ్‌కు మోదీ హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒకసారి బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఆ తర్వాత ఇది రెండోసారి. అప్పుడు జరిగిన మ్యాచ్‌ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. కాగా.. ఇప్పటికే భారత్ ఫైనల్‌ చేరగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా రెండో సెమీ ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన టీమ్‌ ఫైనల్‌లో భారత్‌తో ఢీ కొట్టనుంది.

Next Story