రెండో సెమీ ఫైనల్ ఓ పాఠం.. ఆ త‌ప్పులు చేయ‌కుంటే మ‌న‌దే వ‌ర‌ల్డ్ క‌ప్‌..!

ప్రపంచకప్‌-2023లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat  Published on  17 Nov 2023 9:18 AM GMT
రెండో సెమీ ఫైనల్ ఓ పాఠం.. ఆ త‌ప్పులు చేయ‌కుంటే మ‌న‌దే వ‌ర‌ల్డ్ క‌ప్‌..!

ప్రపంచకప్‌-2023లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్లో భారత్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియాకే కాదు.. భారత జట్టుకు కూడా చాలా నేర్పింది. ఈ మ్యాచ్ చూసిన‌ రోహిత్ కూడా తన వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్ ద్వారా భారత జట్టుకు ప‌లు విజయ మంత్రాలు కూడా ల‌భించాయి. అవి పాటిస్తే వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌న‌దే అంటున్నారు విశ్లేష‌కులు.

రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పెద్ద తప్పులు చేసింది. ఒకటి, రెండు సందర్భాల్లో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రెండు జ‌ట్టు వికెట్లు చేజార్చుకున్నాయి.

ఇప్పుడు టీమ్ ఇండియా ఫైనల్‌లో అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి. దక్షిణాఫ్రికా కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌లో ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా కూడా అదే తప్పును పునరావృతం చేసినప్పటికీ స్కోరు తక్కువగా ఉండటంతో కంగారూ జట్టు స్వల్ప భాగస్వామ్యాలతో విజయం సాధించింది. ఒక‌వేళ‌ వికెట్లు ప‌త‌న‌మైనా ఆ స‌మ‌యంలో క్రీజులో పాతుకుపోయేందుకు స‌న్నాహాలు ర‌చించాలి.

మ‌రోవైపు.. ఈ మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు తమ పార్ట్‌టైమ్ బౌలర్లను సరైన సమయంలో ఎలా ఉపయోగించారనేది చూశాం. ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ సరైన సమయంలో ట్రావిస్ హెడ్‌ను బౌలింగ్‌కు దింపాడు. అతడు 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కూడా ఐడెన్ మార్క్‌రామ్‌ను బౌలింగ్‌కు దింప‌డంతో.. జట్టుకు భారీ వికెట్ ద‌క్కింది. ఒక‌రిద్ద‌రు బౌల‌ర్లు విఫ‌ల‌మైనా పార్ట్ టైమ్ బౌల‌ర్ల‌ను వాడేందుకు సిద్ధ‌మై ఉండాలి.

అది కాకుండా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్యాచ్‌లను ఎలా వదిలేశారో చూశాం. అంత పెద్ద మ్యాచ్‌లో మ్యాచ్ గెలవాలంటే ప్ర‌తీ క్యాచ్ చాలా ముఖ్యం. కానీ సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా క్యాచ్‌లను వదిలేయ‌డంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఈ తప్పిదాలు చేయకుండా ఉంటే విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Next Story