డ్రెస్సింగ్ రూమ్‌లో ష‌మీని ఓదార్చిన ప్రధాని మోదీ

వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ చాలా నిరాశగా, విచారంగా కనిపించారు.

By Medi Samrat  Published on  20 Nov 2023 12:04 PM GMT
డ్రెస్సింగ్ రూమ్‌లో ష‌మీని ఓదార్చిన ప్రధాని మోదీ

వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ చాలా నిరాశగా, విచారంగా కనిపించారు. తడిబారిన‌ కళ్లతో ఉన్న ఆటగాళ్ల చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఓట‌మి త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. ప్రధానమంత్రి భారత ఆటగాళ్లను కలుసుకుని అందరిలో మనోధైర్యాన్ని నింపారు. ఆ సమయంలో మహ్మద్ షమీ చాలా విచారంగా కనిపించాడు. దీంతో ప్రధాని అత‌డిని కౌగిలించుకుని ఓదార్చారు.

ఆదివారం రాత్రి టీమ్ ఇండియా ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి భారత ఆట‌గాళ్ల‌లో ధైర్యం పెంచారు. 'డియర్ టీమ్ ఇండియా.. మొత్తం ప్రపంచకప్‌లో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడి దేశం గర్వించేలా చేశారు. మేము ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామనే సందేశాన్ని రాశారు.'

ఇదిలావుంటే.. ప్రధాని మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన‌ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రధాని మోదీని కలిసిన ఫోటోను షేర్ చేస్తూ మహ్మద్ షమీ.. భావోద్వేగ పోస్ట్ చేశాడు. 'దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మ‌న‌ది కాదు. టోర్నీ సందర్భంగా మా జట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఆయ‌న‌ మా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మా మనోధైర్యాన్ని పెంచారు. మేము బలంగా పుంజుకుంటామ‌ని పేర్కొన్నాడు.

అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని మోదీ వ‌చ్చారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ ట్రోఫీని అందించారు. ఆయనతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా స్టేడియానికి వచ్చారు.

Next Story