'రోహిత్ అద్భుతమైన‌ ఫామ్‌లో ఉన్నాడు.. ఇదే చివరి మ్యాచ్ కాదు'

నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు తన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

By Medi Samrat  Published on  13 Nov 2023 3:45 PM GMT
రోహిత్ అద్భుతమైన‌ ఫామ్‌లో ఉన్నాడు.. ఇదే చివరి మ్యాచ్ కాదు

నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు తన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ కప్ 2019 తర్వాత ఇరు జట్ల మధ్య ఇది ​​వరుసగా రెండో సెమీ-ఫైనల్. టీమ్ ఇండియా లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక అజేయ జట్టు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పుడు అతని కెప్టెన్సీలో జట్టు మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత కెప్టెన్ రోహిత్‌ వయసు పెరుగుతున్న దృష్ట్యా.. ఇదే అతని చివరి ప్రపంచకప్ అని ఊహాగానాలు ఉన్నాయి.

సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మీడియాతో మాట్లాడారు. నిజానికి వాంఖడే రోహిత్‌ సొంత మైదానం. ఇక్కడ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు టీమ్‌ఇండియా ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి వాంఖడేలో రోహిత్‌కి ఇదే చివరి మ్యాచ్‌ కాదా..? రోహిత్‌కి ఇదే చివరి ప్రపంచకప్‌ కాదా..? అని కాలేను ప్రశ్నించగా.. అత‌డు సమాధానమిచ్చాడు.

అమోల్ కాలే ఏఎన్ఐతో మాట్లాడుతూ.. “రోహిత్‌కి ఇక్కడ ఇదే చివరి మ్యాచ్ అని నేను అనుకోను. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రోహిత్ అద్భుతంగా ఆడుతూ ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అలా జరుగుతుందని నేను అనుకోను.” ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతని బ్యాట్‌తో 500కు పైగా పరుగులు సాధించాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ భారత్‌కు శుభారంభం అందించాడు.

వాంఖడే వేదికగా ప్రపంచకప్‌లో టీమిండియా రికార్డు అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో 2011లో భారత జట్టు ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో కూడా ఇదే మైదానంలో టీమిండియా 302 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విషయంలో కివీ జట్టుపై భారత జట్టుదే పైచేయి కనిపిస్తోంది. అయితే ఐసీసీ నాకౌట్ పాత రికార్డులు భారత అభిమానులను భయపెడుతున్నాయి.

Next Story