భావోద్వేగానికి గురైన కోహ్లీ.. భార్య‌ అనుష్క ఓదార్పు..!

2023 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోవడంతో దేశప్రజలందరిలో తీవ్ర‌మైన నిరాశ నెల‌కొంది.

By Medi Samrat  Published on  20 Nov 2023 9:50 AM GMT
భావోద్వేగానికి గురైన కోహ్లీ.. భార్య‌ అనుష్క ఓదార్పు..!

2023 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోవడంతో దేశప్రజలందరిలో తీవ్ర‌మైన నిరాశ నెల‌కొంది. ఇది ప్ర‌తీ క్రికెట్ అభిమానికి కన్నీళ్లు తెప్పించే సంద‌ర్భం. ఫైనల్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. విరాట్ కోహ్లీ 765 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న‌ప్పుడు విరాట్ భాధ‌లోనే ఉన్నాడు. అతని కళ్లలో ఆ బాధ‌ స్పష్టంగా కనిపించింది.

ప్రెజెంటేషన్ వేడుక ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మను కలిశాడు. ఆమెను కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి విరుష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను చూస్తే.. ప్రతి క్రికెట్ అభిమాని.. విరాట్ ఎంత భావోద్వేగానికి గురయ్యాడో ఊహించవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉద్వేగానికి లోన‌య్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే అందరితో కరచాలనం చేసి.. తల వంచుకుని ఏడుస్తూ మైదానం నుండి బయటకు వెళ్లాడు.

2023 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 2003 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. విరాట్‌ 11 ఇన్నింగ్స్‌లలో తొమ్మిదిసార్లు అర్ధ‌సెంచ‌రీ మార్కు దాటాడు. అందులో మూడు సార్లు సెంచరీలు కూడా చేశాడు. తద్వారా త‌న బ్యాట్‌లో మొత్తం 765 పరుగులు రాబ‌ట్టాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెంచ‌రీతో వన్డేల్లో 50 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. విరాట్‌ పేరిట మొత్తం 80 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. 100 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ మాత్రమే అతని కంటే ముందున్నాడు.

Next Story