అభిమానులను నిరాశపరిచే నిర్ణ‌యం తీసుకున్న బీసీసీఐ.. కానీ త‌ప్ప‌దు..!

వ‌న్డే ప్రపంచ కప్‌లో స‌గానికిపైగా మ్యాచ్‌లు అయిపోయాయి. ప్ర‌స్తుతం అభిమానులలో క్రికెట్ క్రేజ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.

By Medi Samrat  Published on  1 Nov 2023 2:15 PM IST
అభిమానులను నిరాశపరిచే నిర్ణ‌యం తీసుకున్న బీసీసీఐ.. కానీ త‌ప్ప‌దు..!

వ‌న్డే ప్రపంచ కప్‌లో స‌గానికిపైగా మ్యాచ్‌లు అయిపోయాయి. ప్ర‌స్తుతం అభిమానులలో క్రికెట్ క్రేజ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇటువంటి ప‌రిస్థితుల‌లో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణ‌యం అభిమానులను కాస్త నిరాశపరిచే అవ‌కాశం ఉంది. ఢిల్లీ, ముంబైలలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున.. ఈ రెండు పెద్ద నగరాల్లో మిగిలిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల సందర్భంగా బాణసంచా వినియోగాన్ని బీసీసీఐ నిషేధించింది.

ప్ర‌స్తుతానికి ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఢిల్లీలో జరగాల్సి ఉంది. ముంబైలో మ‌రో మూడు మ్యాచ్‌లు జరగాల్సివుంది. బంగ్లాదేశ్ నవంబర్ 6న ఢిల్లీలో శ్రీలంకతో తలపడనుంది. అంత‌కుముందు భారత జట్టు నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో ఆడుతుంది. దీని తర్వాత నవంబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా, నవంబర్ 15న తొలి సెమీ ఫైనల్‌కు ముంబైలోని వాంఖ‌డే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

"బిసిసిఐ పర్యావరణ సమస్యల పట్ల సున్నితంగా ఉంది. నేను ఐసిసితో చ‌ర్చింది ఈ నిర్ణ‌యాన్ని అధికారికంగా తీసుకున్నాను. ముంబైలో ఎటువంటి బాణసంచా ప్రదర్శనలు ఉండవు. ఇది కాలుష్య స్థాయిని పెంచుతుంది" అని బిసిసిఐ కార్యదర్శి జే షా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంది. ఎల్లప్పుడూ అభిమానులు, వాటాదారుల ప్రయోజనాలకు ప్రాధాన్య‌త ఇస్తుంది. ముంబై, న్యూఢిల్లీల‌లో గాలి నాణ్యతకు సంబంధించిన అత్యవసర ఆందోళనలను బీసీసీఐ గుర్తించిందన్నారు. మేము అంద‌రి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే మా నిబద్ధతలో మేము స్థిరంగా ఉన్నామన్నారు.

ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది. ముంబైలో కూడా కాలుష్యం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ సమస్యను స్వయంగా స్వీకరించిన బాంబే హైకోర్టు మంగళవారం ముంబైలో గాలి నాణ్యత సూచిక క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Next Story