91 లక్షల దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1.83 లక్షల కేసులు

By సుభాష్  Published on  23 Jun 2020 2:47 AM GMT
91 లక్షల దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1.83 లక్షల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో తీవ్ర భయాందోళన నెలకొంది. చైనాలో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచదేశాలను సైతం కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. మృత్యువును వెంటాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కేవలం 24 గంటల్లో బ్రెజిల్‌లో 54,771 కేసులు, అమెరికాలో 36,617 కేసులు నమోదు కావడం.. కరోనా ఏ మేరకు విస్తరిస్తోందో అర్థమైపోతోంది. అన్ని దేశాల్లో కరోనా పరీక్షలు పెంచడం వల్ల కరోనా కేసులు బయటపడుతున్నాయని, అందుకే ఎన్నడులేని విధంగా కొత్త కొత్త ప్రాంతాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.

ఇక తాజాగా లెక్క ప్రకారం చూస్తే.. ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన కేసులు 91,01,386కి చేరగా, ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 4 లక్షల 71వేలు దాటేసింది. ఇక ప్రస్తుతం 37,55,318 కేసులు యాక్టీవ్‌గా ఉండగా, ఇప్పటి వరకూ 48,74,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక అమెరికా, బ్రెజిల్‌లో మాత్రం కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి.. మరోసారి ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇక అమెరికాలో తీవ్ర స్థాయిలో దూసుకుపోతుంది కరోనా. తాజాగా 12,62,290 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే బ్రెజిల్‌లో 4,57,105 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల 70వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక శనివారం జర్మనీలోని ఓ మాంసం ప్యాకింగ్‌ చేసే ఫ్యాక్టరీలో 750 మందికి కరోనా సోకగా, ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 7వేల మంది ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

కాగా, స్పెయిన్‌లో మూడు నెలల క్రితం విధించిన ఎమర్జెన్సీను ఎత్తివేసింది. ఇక బ్రిటన్‌తో పాటు 26 ఇతర యూరోపియన్‌ దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనలు రద్దు చేసింది. ఈ దేశాల్లోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా దాదాపుగా కరోనా తీవ్ర స్థాయిలోనే విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ సంఖ్య పెరుగుతుండటంతో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇక అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను సైతం కలవర పెడుతోంది. కేసులు ఎక్కువవుతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముందుగా ట్రంప్‌ కరోనా గురించి నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా పాజిటివ్‌ కేసులు పెరిగేందుకు కారణమని అక్కడి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకముందు ట్రంప్‌ పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చినా తమ దేశంలో ఎదుర్కొనే సత్తా ఉందని, తమ దేశానికి రాదని, వచ్చినా.. టెక్నాలజీ పరంగా తిప్పికొడతామని ప్రగల్బాలు పలికిన ట్రంప్‌కు.. ఇప్పుడు కంటినిండ కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది.

కాగా, గత ఏడాది డిసెంబర్‌ 31నాటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు హెచ్చరించింది. అంతుపట్టని ఓ వైరస్‌ చైనాలో తీవ్రస్థాయిలో విజృంభించబోతోందని హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో న్యుమోనియా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కారణమైన వైరస్‌ వైద్య ప్రపంచానికి సవాల్‌ విసిరింది. ఇప్పట్లో తాత్కాలికంగా నావల్‌ కరోనా వైస్‌ అని నామకరణం చేశారు.

Next Story