కివీస్‌లో కోహ్లీ సేన స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఆసీస్‌లో అమ్మాయిలు ఇర‌గ‌దీశారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Feb 2020 7:41 AM GMT
కివీస్‌లో కోహ్లీ సేన స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఆసీస్‌లో అమ్మాయిలు ఇర‌గ‌దీశారు..!

ముక్కోణపు టి20 సిరీస్‌లో భాగంగా ఆసీస్ మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన పోరులో టీమిండియా మహిళల జట్టు రికార్డు విజయం న‌మోదు చేసుకుంది. ఈ విజ‌యం.. టీమిండియాకు టి20ల్లో అతిపెద్ద ఛేజింగ్‌ కావడం విశేషం. ఆసీస్ నిర్దేశించిన‌ 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. స్టార్ బ్యాట్స్‌వుమెన్‌ స్మృతి మంధాన(55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించగా.. 16 ఏళ్ల షెఫాలి వర్మ విధ్వంసం సృష్టించింది. కేవ‌లం 18 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేసి ఆసీస్‌కు చుక్క‌లు చూపించింది. వీరికి తోడు రోడ్రిగ్స్‌(30), కౌర్‌(20) మెరిశారు.

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. అస్‌లీన్ గార్డ్‌నర్‌ విజృంభించి ఆడి 57 బంతుల్లో (11ఫోర్లు, 3 సిక్స్‌లు)తో 93 పరుగులు చేయ‌గా.. మెగ్‌ లానింగ్‌ 37 పరుగులతో ఆక‌ట్టుకుంది. ఇక‌ భార‌త బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.

ఇదిలావుంటే.. ఇంగ్లాండ్ కూడా పాల్గొంటున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండు మ్యాచ్‌లలో గెలిచి, మ‌రో రెండింటిలో ఓడింది. ఓవ‌రాల్‌గా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో ఉండ‌గా.. ఆస్ట్రేలియా మూడో స్థానంలో వుంది.

Next Story