ఓ యువతి నడుచుకుని వస్తూ ఉంటే.. అందరూ ఆమె పాదాల మీద పడి నమస్కరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. త్రివేండ్రం మెడికల్ కాలేజీలో నర్సింగ్ పూర్తీ చేసిన మహిళ అని కొందరు చెబుతూ ఉంటే.. ఇంకొందరేమో కొడగు జిల్లా కలెక్టర్ ఆమె అని చెబుతూ ఉన్నారు. ఆమె కరోనా సమయంలో పరిస్థితులను బాగా హ్యాండిల్ చేసిందని.. అందుకే ప్రజలు ఆమె పట్ల అంత గౌరవం చూపిస్తూ ఉన్నారని వీడియోను పోస్టు చేస్తూ ఉన్నారు.
వాట్సప్, యూట్యూబ్ లలో కూడా ఇలాగే పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆమె నర్సింగ్ చేసిన తర్వాత ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యి.. కొడగు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిందని.. ఆమెకు ఉన్న నర్సింగ్ అనుభవంతో కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రబలకుండా అడ్డుకుందంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఆమె త్రివేండ్రం మెడికల్ కాలేజీలో చదివి.. ఆ తర్వాత కలెక్టర్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా వీడియోను మార్చి 5, 2020న యూట్యూబ్ లో పోస్టు చేసినట్లు గుర్తించవచ్చు. ఆ వీడియో టైటిల్ గా ‘GRAND WELCOME DIAMOND LEADER SAFE SHOP MS NAZIA MADAM’ అని పెట్టారు.
‘Nazia Begum Safe shop diamond leader’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా ఆమెకు సంబంధించిన ఎన్నో వీడియోలు దొరికాయి. చాలా వీడియోలలో ఆమెకు ఇలాంటి ఆహ్వానాలే పలికారు చాలా మంది.
నజియా బేగమ్ కు సంబంధించిన వీడియోలను చూడొచ్చు.
సేఫ్ షాప్ అన్నది 'మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ'.. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఈ కంపెనీకి ఎటువంటి వెబ్సైట్ కూడా లేదు. ఫేస్ బుక్ పేజీ లింక్ లభించింది.
అక్టోబర్ నెలలో కూడా ఇదే వీడియో వైరల్ అయింది. హత్రాస్ ఘటన బాధితురాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదంటూ నిజ నిర్ధారణ సంస్థలు స్పష్టం చేశాయి. The Quint, Factly, Boomlive లలో నిజ నిర్ధారణ చేసిన ఆర్టికల్స్ ను గమనించవచ్చు.
ఆమె ఒక నర్స్, కలెక్టర్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన మహిళ.