రాజస్థాన్‌లో దారుణం.. కాలినడకన సొంతూరికి వెలుతుండగా..
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 8:57 PM IST
నెలరోజులుగా దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. మహిళల రక్షణ కోసం నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. వారిపై ఆరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. జైపూర్‌కు చెందిన ఓ మహిళ పని నిమిత్తం వేరే ఊరు వెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా నెలరోజులకు పైగా అక్కడే చిక్కుకుపోయింది. చేసేది ఏమీ లేక.. కాలినడకన బయలు దేరింది. ఓ చోట విశ్రాంతి తీసుకుంటున్న ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన మహిళ(40) ఓ పని నిమిత్తం సవాయ్ మాధోపూర్‌కి వెళ్లింది. అప్పుడే కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను విధించింది. దీంతో ఆ మహిళ నెలరోజులుగా అక్కడే చిక్కుకుపోయింది. ఇంటికి వెళదాం అనుకుంటే.. రవాణా సదుపాయం లేదు. దీంతో ఆ మహిళ కాలినడకన గురువారం సొంతూరుకు బయలు దేరింది. రాత్రి కావడంతో.. మాధోపూర్ జిల్లా బాటోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పడుకుంది. అర్థరాత్రి ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం జరిగిన ఘటనపై పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రిషికేశ్‌మీన, లఖన్ రేగర్, కమల్ ఖర్వాల్‌లను అదుపులోకి తీసుకున్నారు.