దేశంలో నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మనుమరాలి వయసున్న చిన్నారిపై వృద్ధుడు, చెల్లెలిపై అన్న, పసిపాపపై కామాంధుడు, మతిస్థిమితం లేని యువతిపై ఆవారాలు అత్యాచారాలకు పాల్పడ్డారు. ఆడపిల్లల రక్షణ కోసమని నిర్భయ, అభయ, దిశ..ఇలా ఎన్ని చట్టాలు తీసుకొస్తేనేమి..ఎక్కడ జరగాల్సిన దారుణాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. దిశ ఉదంతం తర్వాత మళ్లీ ఆడపిల్ల జోలికి వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత..వాయిదాల మీద వాయిదాలు పడిన ఉరిశిక్షను ఎట్టకేలకు నిర్భయ నిందితులకు అమలు చేశారు. ఇలాంటివి చూశాక కూడా కామాంధుల ఆలోచనల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసినవాడిని చేసినట్లే ఎన్ కౌంటర్ చేసేలా చట్టాలు వస్తేనైనా మార్పొస్తుందేమో.

Also Read : మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య..కరోనా వల్లేనా ?

తాజాగా రాజస్థాన్ లోని బికనేర్ జిల్లాలో మహిళా రైతుపై దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 13 రోజులుగా ఆ మహిళను చిత్రహింసలు పెడుతూ రాక్షసానందం పొందారు. ఎట్టకేలకు వారి చెర నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. ఏప్రిల్ 3వ తేదీన పొలంలో పని చేసుకుంటున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఎవరికీ తెలియని ప్రదేశంలో బంధీని చేశారు. 13 రోజులపాటు ఆ మహిళను చిత్రహింసలు పెడుతూ నరకం చూపించారు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పలుమార్లు అత్యాచారం చేసి తమ కామవాంఛను తీర్చుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Also Read : ఆర్మీ జవాన్ దంపతుల ఆత్మహత్య..అసలు కారణం ?

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.