క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఇక అత్య‌వ‌స‌ర రంగాల్లో ప‌నిచేసే వారికి లాక్‌డౌన్‌లో బ‌య‌టికి వెళ్లేందుకు పాస్‌లు ఇచ్చారు. పాస్ ఉన్నా స‌రే భ‌ర్త‌.. మూడు రోజుల‌కు ఓ సారి ఇంటికి రావ‌డంతో భార్య‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో భ‌ర్త బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

కూకట్‌పల్లికి చెందిన సురేష్‌(పేరు మార్చాం) ఫార్మా ఉద్యోగి కావ‌డంతో పోలీసులు ఆయ‌న‌కు వాహ‌న అనుమ‌తి పాస్ ఇచ్చారు. దీంతో సురేష్ రోజు కంపెనీకి వెలుతున్నాడు. కానీ మూడు రోజుల‌కు ఓ సారి ఇంటికి వ‌స్తున్నాడు. దీంతో భార్య సురేష్ ను నిల‌దీసింది. ఇప్ప‌టికే క‌రోనా భ‌యంతో తాను ఒక్కదానినే ఇంట్లో ఉంటున్నాన‌ని.. పాస్ ఉన్న‌ప్ప‌టికి రోజు ఎందుకు రావ‌డం లేద‌ని సురేష్ ను ప్ర‌శ్నించింది. పాస్ ఉన్నా కూడా.. కొంద‌రు పోలీసులు త‌న‌ను అనుమ‌తించ‌డం లేదంటూ స‌మాధాన‌మిచ్చాడు. భ‌ర్త చెప్పిన మాటలు న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోవ‌డం, అత‌డి ప్ర‌వ‌ర్త‌న తేడాగా ఉండ‌డంతో.. భార్య‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో తెలిసిన వారి సాయంతో ఆరా తీసింది.

ఇక సురేష్ ప్ర‌తి రోజు డ్యూటీ అయిపోగానే అదే ప్రాంతంలో ఉంటున్న మ‌రో మ‌హిళ ఇంటికి వెలుతున్న‌ట్లు తెలిసింది. ఇది తెలిసిన అత‌డి భార్య అవాక్కైంది. మ‌రో మ‌హిళ‌తో భ‌ర్త వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుండ‌డంతో.. సైబ‌రాబాద్ షీ టీమ్‌కి ఫిర్యాదు చేసింది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నార‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇలా వేరే వారి ఇళ్ల‌కు వెళ్లి రావ‌డం వ‌ల్ల క‌రోనా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని పోలీసుల‌ను కోరింది. పోలీసులు సురేష్ కి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహాన అనుమ‌తి పాస్ ను దుర్వినియోగం చేయ‌డ‌మే కాకుండా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంగించి ఇత‌రుల ఇళ్ల‌కు వెళ్లి.. భార్య, పిల్ల‌ల ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టినందుకు కేసు న‌మోదు చేస్తామ‌ని, ఇక నుంచైనా బుద్దిగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. రోజు ఇంటికి వెళ్ల‌కుంటే.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.