వికారాబాద్ జిల్లాలో దారుణం.. చిన్నారిని చంపి తల్లి ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 19 April 2020 4:33 PM IST
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఏడాది వయస్సున కొడుకుని చంపి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుందో వివాహిత. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ లో చోటు చేసుకుంది. సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కుదురుమల్లకు చెందిన శ్రీనివాస్.. 2016లో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లైన ఆరు నెలల్లోనే విడిపోయారు.
బ్రతుకు తెరువు కోసం శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన మల్లిక(24) కూడా పనిచేస్తుండేవి. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈక్రమంలో 2017లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి సాత్విక్(11 నెలలు) జన్మించాడు. కరోనా వైరస్ ముప్పుతో లాక్‌డౌన్ విధించడంతో.. మార్చి నెలలో వీరు హైదరాబాద్ నుంచి కుదురుమల్లకు వచ్చారు. గ్రామంలో హాయిగా జీవిస్తున్నారు.
కాగా.. శనివారం ఉదయం సాత్విక్ కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చారు. కొద్ది సేపటి తరువాత శ్రీనివాస్, అతని తల్లిదండ్రులతో కలిసి బయటికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి వారు చూడగా.. మల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. ఏడాది వయసు ఉన్న బాలుడు విగత జీవిగా పడి ఉన్నాడు. బాలుడి గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. మల్లిక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.