చేవెళ్లలో దారుణం.. ‘దిశ’ ఘటన తరహాలోనే..
By Newsmeter.Network
గతకొద్దిరోజుల క్రితం జరిగిన ‘దిశ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ప్రస్తుతం దిశ ఘటన తరహాలోనే మరో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read :సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవదహనం
మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసును చేధించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే మహిళలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. మృతురాలికి సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించక పోవటంతో ఆమె వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
చేవెళ్ల డీఎస్పీ రవీందర్ రెడ్డి ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశముంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దిశ ఘటన తరహాలోనే మహిళను అత్యాచారం చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసి బండరాయితో మోది హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనస్థలానికి భారీగా తరలివచ్చారు.