పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిలీండర్‌ పేలితల్లీకొడుకు  సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన అర్థరాత్రి సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలో ఈ ఘటన జరిగింది. గొట్టె యశోద(45), గొట్టే రోహన్‌(17) ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో సిలీండర్‌ పేలింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో.. గాఢ నిద్రలో ఉన్న వీరు సజీవదహనమయ్యారు. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు లేచి చూసేసరికి తల్లీ, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే యశోద భర్త ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. వేసవికాలం కావటంతో అతడు ఇంటి బయట నిద్రించాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

రాత్రి నిద్రించే సమయం వరకు తమతో కలిసి ఉన్న వీరు తెల్లారేసరికే సజీవదహనమై కనిపించడంతో గ్రామంలో విషాదచాయలు అమలుకున్నాయి. భార్య, చేతికొచ్చిన కొడుకు మృతిచెందడంతో భర్త కన్నీరు మున్నీరవుతున్నాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎసీపీ హబీబ్‌ ఖాన్‌, సీఐ ప్రదీప్‌ కుమార్‌లు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనుమానిత కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే రోహన్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్నాడని పోలీసులు తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.