మాజీ హైదరాబాద్ పోలీసు కమీషనర్ భార్యకు ఎన్ని కష్టాలో..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2020 6:27 AM GMTఇస్మాయిల్ పుల్లన్న.. హైదరాబాద్ మాజీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భార్య కిషన్ కుమారి తన కుమార్తె మీదనే సంచలన ఆరోపణలు చేశారు. ఆస్థి కోసం తన కుమార్తె వేధిస్తోందని ఆమె ఆరోపించారు. తన కుమారుడిని అకారణంగా అరెస్ట్ చేశారని లేట్ ఇస్మాయిల్ పుల్లన్న భార్య కిషన్ కుమారి బాధను వ్యక్తం చేశారు.
శనివారం నాడు ఇస్మాయిల్ పుల్లన్న కుమారుడు పవన్ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ లో రిజిస్టర్ అయిన 'ఆక్రమణల' కేసులో పవన్ ను 15 గంటల పాటూ విచారించారు. హై కోర్టు ఆర్డర్లను లెక్క చేయకుండా పోలీసులు ఈ పనికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
తన కుమార్తె రాణి కుముదిని తమను వేధిస్తోందని ఆరోపించారు. రాణి కుముదిని తెలంగాణ ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ కమీషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. తన ఆస్థిని కూడా చేజిక్కించుకోవాలని కుమార్తె ప్రయత్నాలు చేస్తోందని కిషన్ కుమారి ఆరోపించారు. కిషన్ కుమారి, ఇస్మాయిల్ పుల్లన్న తమ ఆస్థిని ముగ్గురు పిల్లలైన పవన్, ఇద్దరు కూతుళ్ళకు(ఒకరు రాణి కుముదిని కాగా.. మరొకరు ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్) బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఉన్న నాలుగు అంతస్థుల బిల్డింగ్ ను పంచి ఇచ్చారు. కిషన్ కుమారి పేరు మీద మొదటి, రెండో అంతస్థులు ఉన్నాయి. మూడో అంతస్థును పవన్ దగ్గర నుండి కుముదిని కొన్ని సంవత్సరాల కిందటే కొనుక్కుంది. ఇప్పుడు కుముదిని తన పేరు మీద ఉన్న ఆస్థిని సొంతం చేసుకోవాలని భావిస్తోందని కిషన్ కుమారి ఆరోపిస్తోంది. తన మరో కుమార్తె కూడా కుముదినికి మద్దతుగా ఉందని కిషన్ కుమారి చెబుతోంది. ఇప్పటికే ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేయించి మొదటి రెండు అంతస్థులను వారి సొంతం చేసుకోవాలని భావించారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో మొదటి అంతస్థులో కొంత భాగాన్ని కూల్చి వేయించారని తెలిపింది కిషన్ కుమారి.
పవన్ భార్య దివ్య రావు ఈ ఘటనపై స్పందించారు. కుముదిని చేస్తున్న పనులకు తన భర్త అడ్డు చెప్పడంతో ఆయన్ను అరెస్ట్ చేయించిందని ఆరోపించింది. హై కోర్టుకు వెళ్లి ఇంజన్క్షన్ ఆర్డర్ ను తీసుకుని వచ్చామని దివ్య తెలిపారు. కానీ కుముదిని మాటలను బంజారా హిల్స్ పోలీసులు నమ్మి.. కోర్టు ఉత్తర్వులను గౌరవించకుండా తన భర్తను తీసుకుని వెళ్లారని దివ్య చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్లు తమకు సహాయం చేయాలని కోరారు కిషన్ కుమారి. 'నా కొడుకును బంజారాహిల్స్ పోలీసులు కాలర్ పట్టుకుని మరీ లాక్కుని వెళ్లి.. పోలీసు వాహనంలో వేశారు. అంత తప్పు నా కుమారుడు ఏమి చేశాడు.. ఏమైనా క్రిమినలా..?' అని కిషన్ కుమారి ప్రశ్నించారు. ఈ ఘటన విషయంలో బంజారాహిల్స్ పోలీసులు నోరు మెదపకుండా ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ పోలీసు కమీషనర్ ఈ విషయంలో కల్పించుకోవాలి ఆమె కోరారు.