వ్యాక్సిన్ లేకుండానే దసరా కల్లా మహమ్మారి మటాష్.. వైరల్ గా కొత్త థియరీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2020 11:33 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగానికి చెక్ పెట్టే మందు లేకపోవటం తెలిసిందే. దీన్ని తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నారు. మరో రెండు..మూడు నెలల్లో ఫలితాలు రావొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అసలు వ్యాక్సిన్ అవసరం లేకుండానే ఈ ప్రాణాంతక వైరస్ పని అయిపోతుందన్న కొత్త వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. రానున్న దసరా (సెప్టెంబరు.. అక్టోబరు) నాటికి దీని పని అయిపోతుందన్న మాట వినిపిస్తోంది.
అంత సింఫుల్ గా ఎలా చెప్పేస్తారని ప్రశ్నిస్తున్న వేళ.. ఈ కొత్త థియరీని తెర మీదకు తీసుకొచ్చారు ఇండియా.. ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు. రోజురోజుకు కేసులు పెరగటంతో పాటు.. మరణాలు చోటు చేసుకుంటున్న ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అవసరం లేకుండానే ఎలా అంతమవుతుందన్న దానికి వారు వినిపిస్తున్న వాదన వింటే.. లాజిక్ గా ఉండటమే కాదు.. నిజమే కదా? అన్న భావన కలగటం ఖాయం.
ఇటలీ అంటువ్యాధుల స్పెషలిస్టు మ్యాటియో బసెట్టి చెబుతున్న మాటల్నే తీసుకుంటే.. ఎబోలా.. స్వైన్ ఫ్లూ.. సార్స్.. మెర్స్ ఇలా ఎన్నో వైరస్ లు మొదట్లో చూపించే తీవ్రతతో పోలిస్తే.. తర్వాతి కాలంలో దాని ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే మహమ్మారికి తప్పదన్నది ఆయన వాదన. వైరస్ వెలుగు చూసిన నాటితో పోలిస్తే.. ఇప్పుడీ వైరస్ చాలా బలహీనమైందన్నది ఆయన ప్రధాన వాదన.
వైరస్ వ్యాప్తి జోరుగా ఉండే కానీ.. గతంలో మాదిరి ప్రాణాంతకంగా లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మార్చి.. ఏప్రిల్ మొదట్లో మాయదారి రోగం సోకిన వారితో పోలిస్తే.. ఇప్పుడు దాని తీవ్రత తగ్గిందంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడిన 80.. 90 ఏళ్ల లోపు వారు కూడా కోలుకోవటాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. అంత వయసులోనూ వెంటిలేటర్ అవసరం లేకుండానేచికిత్స తీసుకొని మహమ్మారిని జయిస్తున్న వారున్నారని చెబుతున్నారు.
గతంలో వేసిన అంచనాలకు తగ్గట్లే ఈ నెలాఖరకు భారత్ లో కేసుల తీవ్రత పెరుగుతుందని.. ఆగస్టుకు మరింత ఎక్కువకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. సెప్టెంబరు వచ్చే నాటికి భారత్ లో మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గుతుందన్న అంచనా వినిపిస్తోంది. అటు ఇటుగా దసరా నాటికి ఈ మాయదారి రోగం పూర్తిగా అదుపులోకి రావటమే కాదు.. కొత్త కేసుల నమోదు కూడా తగ్గిపోతుందన్న వాదనను వినిపిస్తున్నారు.
రోజులు గడిచే సరికి ఈ వైరస్ బలహీనపడటం.. దాన్ని అధిగమించేలా మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరగటాన్ని చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే.. తాజాగా మరణాల రేటు కూడా తగ్గటం తమ వాదనకు బలం చేకూరినట్లేనని చెబుతున్నారు. ఒకవేళ.. వ్యాక్సిన్ అవసరం లేకుండానే మహమ్మారి తగ్గుముఖం పడితే ప్రపంచానికి అంతకు మించి కావాల్సిందేముంది? మరి.. ఈ అంచనా ఎంతవరకు వాస్తవమన్నది కాలమే డిసైడ్ చేయాలి.