అంబటి రాయుడిని తీసుకోకపోవడానికి అదే కారణం : మాజీ సెలక్టర్‌ గగన్‌ ఖోడా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 5:09 PM IST
అంబటి రాయుడిని తీసుకోకపోవడానికి అదే కారణం : మాజీ సెలక్టర్‌ గగన్‌ ఖోడా

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడిని 2019 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో ఎంపిక చేయలేదు. రాయుడి బదులు ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ను ఎంపిక చేయగా.. తన ప్రదర్శనతో అభిమానులను, జట్టును నిరాశపరిచాడు. విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేయడం అప్పట్లో చాలా చర్చలకు దారి తీసింది. దానికి తోడు ఆ టోర్నీ జరుగుతున్న సమయంలోనే రాయుడు క్రికెట్ కు వీడ్కోలు పలకడం ఇంకా హల్ చల్ చేసింది. అయితే ఈ విషయం పై మాజీ సెలక్టర్ గగన్ ఖోడా స్పందించారు.

ఆ మెగా టోర్నీకి ముందు రాయుడిని ఏడాది పాటు పరిశీలించామని, అప్పుడు అతడిలో సరైన స్పందన కనిపించలేదని గగన్‌ అన్నారు. రాయుడు ఎంత అనుభవజ్ఞుడైనా ప్రపంచకప్‌లో ఆడాలనే ఆత్మవిశ్వాసం అతడిలో లేదని చెప్పారు. ''అప్పడు ప్రపంచ కప్ జట్టును సెలెక్ట్ చేసే వరకు రాయుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే తుది ఎంపిక చేసే రోజు అతను సెలక్ట్ కాలేదు. మేము అతనితో ఒక సంవత్సరం పాటు కొనసాగాము, కానీ అతను ఉన్న చోటనే ఉన్నాడని భావించాము. అతడిలో ప్రపంచ కప్‌కు వెళ్లి ఆడే విశ్వాసం మాకు కనిపించలేదు. అందుకే ప్రపంచ కప్ కు మేము అతడిని సెలక్ట్ చేయలేదు'' అని తెలిపాడు.

ఇక ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌ నుంచే వెనుదిరగడం పై మాట్లాడుతూ.. కోహ్లీ సేన ఏ విభాగంలోనూ తక్కువగా ఉందని తమకు అనించలేదని, కివీస్‌తో ఆడినప్పుడే అలా జరిగిపోయిందని గగన్ ఖోడా అన్నారు. సెమీస్‌లో తొలి రోజు వర్షం కురవడంతో టీమ్‌ఇండియా రెండో రోజు ఆటలో పట్టుకోల్పోయిందని పేర్కొన్నారు. కాగా.. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తృటిలో ఓటమి పాలైంది. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలబడగా.. జడేజా(77), ధోని(50) అద్భతంగా పోరాడాడు. కీలక సమయంలో జడేజా భారీ షాట్‌కు యత్నించి ఔట్ కాగా.. ధోని రనౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో ప్రపంచకప్‌లో భారత కథ అక్కడితో ముగిసింది.

భారత జట్టులో చోటు దక్కలేదు అనే బాధలో ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలోనే రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు. కాగా, హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన రాయుడు గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.

Next Story