ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి..టైమ్ కూడా ఫిక్స్ చేసిన హైకోర్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 10:47 AM GMT
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి..టైమ్ కూడా ఫిక్స్ చేసిన హైకోర్ట్

హైదరాబాద్‌: కార్మికులతో చర్చలు జరపాల్సిందేనని ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్ట్ స్పష్టం చేసింది . రేపు ఉదయం 10.30కు చర్చలు మొదలు పెట్టాలని చెప్పింది. చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది తెలిపారు. చర్చలు విఫలమైతే సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని జేఏసీ న్యాయవాది తెలిపారు.

దేశాయ్ ప్రకాష్ రెడ్డి, జాక్ అడ్వొకేట్

చర్చలు కోసం ప్రయత్నించామని ఆర్టీసీ జాక్‌ తరపు లాయర్ దేశాయ్‌ ప్రకాష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు సార్లు ఫోన్లు చేసినా ప్రభుత్వ న్యాయవాదులు స్పందించలేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే తప్పా..చర్చల్లేవని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. అన్ని డిమాండ్లను కోర్ట్ ముందు పెట్టామని..అందులో సాధ్యం కానివి, అయ్యేవి ఏవో చెప్పాలన్నారు. ప్రతీ సమస్యను లేబర్ కోర్టే తేల్చాలంటే కుదరదు..కొన్నింటికీ చర్చలే పరిష్కారం అన్నారు జాక్ తరపు లాయర్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని కోర్ట్ దృష్టికి తెచ్చారు దేశాయ్ ప్రకాష్ రెడ్డి.

ప్రభుత్వ న్యాయవాది

కార్మిక సంఘాల డిమాండ్లు నెరవేర్చాలంటే ఆర్ధిక భారం అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు ప్రభుత్వ న్యాయవాది. 46 డిమాండ్లు ఉంటే అందులో 20 డిమాండ్లు ఆర్ధికంగా భారమేనన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఒకే అయితేనే తదుపరి చర్చలు వుంటాయని సంఘాల ప్రతినిధులు అన్నారని కోర్ట్‌కు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది. చర్చల వివరాలు 28న తమకు చెప్పాలని హైకోర్ట్ ఆదేశించింది.

ఆర్టీసీ ఎండీని ఎందుకు నియమించలేదు..?!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోందని.. ఆ సంస్థకు ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆర్టీసీకి ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం ఏర్పడి ఉండేదని.. ఎండీ నియామకం, హెచ్‌ఆర్‌ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొంది. సమ్మెతో ప్రజలు రెండువారాలుగా ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.

రేపటి బంద్ కు అన్ని వర్గాల మద్దతు?!!!

రేపటి బంద్‌కు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు క్యాబ్‌ డ్రైవర్లు మద్దతిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి వల్లే ఎండీ నియామకం చేపట్టలేదని వివరించారు. ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story