ఓ అందుకే 'ఆది' బీజేపీలో చేరాడా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 4:26 PM GMT
ఓ అందుకే ఆది బీజేపీలో చేరాడా..?!

రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారికుంటాయి, ప్రస్తుత రాజకీయాల్లో మనం అక్కడికి పోతే ఎంత లాభం..ఆయన మనకొస్తే ఎంత లాభం అన్నట్లే ఉన్నాయి. ఈ మనిషి ప్రజల కోసం పని చేస్తాడా..?లేదా అనేది ఎవరూ చూడటంలేదు. ఇది నేటి రాజకీయాలకు పట్టిన దౌర్భగ్యం. 1947కు ముందు ప్రజలకు సేవ చేయాలని బలంగా నిర్ణయించుకున్నవారే రాజకీయాల్లోకి వచ్చేవారు. 1970 దశకం వరకు కూడా ఈ ఆలోచన ఉన్న నాయకులే రాజకీయాల్లో కనిపించే వారు.

కాని.. ఆ తరువాతనే భారత రాజకీయ రంగంలో సీన్ మారిపోయింది. స్వార్యపరులు, వ్యాపారస్తులు, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నవారు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి రాజకీయాల్లో డబ్బు సంపాదించేవారే కనిపిస్తున్నారు కాని.. ప్రజలకు సేవ చేద్దామనుకునే వారు చాలా తక్కువుగా కనిపిస్తున్నారు.

ఏ ఎండకు ఆ గొడుగు..!

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కొంత మంది రాజకీయ నేతలు ఆరితేరి ఉంటారు. వీరికి సిద్దాంతాలు ఉండవు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చాలా సునాయాశంగా దూకేస్తారు. అధికారంలో ఉన్నవారికి జై కొడుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఎప్పుడో హర్యానాలో అయారామ్..గయారామ్‌ గురించి విన్నాం.

రాజకీయమే పరమావధి..!

ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సీపీలో కలిసిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరారు. అంతేకాదు..మంత్రి పదవిని కూడా అనుభవించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. దేవగుడి సోదరులు. తరువాత వైఎస్ఆర్ సీపీలో కొనసాగారు. ఆదినారాయణ రెడ్డిది ఎప్పుడూ ఊగిసలాట ధోరణియే. 2009 -14 మధ్య కూడా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా ఉండి..టీడీపీలోకి వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. వైఎస్ జగన్‌కు బాగా దూరం మెయింటైన్ చేశారు. 2014లో వైఎస్ జగన్ సీఎం అవుతారని..టీడీపీలోకి వెళ్లకుండా ఆది ఆగాడంటారు. 2014లో వైఎస్ఆర్‌ సీపీ నుంచే పోటీ చేసి గెలిచాడు. తరువాత..మళ్లీ రివర్స్ గేర్‌ వేశారు ఆది నారాయణ రెడ్డి. వైఎస్ జగన్ దగ్గర రాజకీయంగా స్వేచ్ఛ ఉండదని అనుకున్నారో ఏమో టీడీపీలో చేరారు ఆదినారాయణ రెడ్డి. టీడీపీలొ చేరగానే వైఎస్ జగన్ రాజకీయాలకు పనికి రాడంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. రాజకీయాలే తెలియవన్నారు. ఎస్సీలు శుభ్రంగా ఉండరని ఎద్దేవా చేశారు. ఇలా నోరు పారేసుకోవడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో టీడీపీ ఓడిపోయినట్లే..ఆది కూడా ఘోరంగా ఓడిపోయారు. అంతే..ఆంధ్రలో కనిపించడం మానేశారు.

హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం బీజేపీలో చేరిక..!

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తరువాత ఆది ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కమలం కండువా కప్పుతూ బీజేపీలోకి ఆదిని ఆహ్వానించే ఫొటో రిలీజ్ అయింది. టీడీపీలో కొనసాగుతానని ప్రకటించి నెల కూడా కాలేదు. ఒక్కసారిగా ఆది ఎందుకు ప్లేట్ ఫిరాయించాడు?. చంద్రబాబు సలహా మేరకే బీజేపీలో చేరాడా?.లేకపోతే రాజకీయంగా టార్గెట్ అవుతానిని భయపడి బీజేపీలో చేరాడా? బీజేపీలో చేరితే తన ఆస్తులకు, తనకు రక్ష ఉంటుందనే భరోసాతో బీజేపీలో చేరాడా?.లేకపోతే సుజనా ప్యాకేజీలో భాగంగానే బీజేపీలో చేరాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఆపరేషన్‌ కమలంలో భాగంగా ..టీడీపీ నేతలు ఒక్కొక్కరూ బీజేపీలోకి వెళ్దున్నారు. వెళ్లిన నేతలు మళ్లీ ఎన్నికలు నాటికి బీజేపీలోనే ఉంటారా..? టీడీపీ గూటికి చేరుతారా ? అనేది బేతాళ ప్రశ్న.

వైఎస్ఆర్ జిల్లా రాజకీయ లెక్కలు మారుతున్నాయా?

అయితే..బీజేపీతో సఖ్యతగా ఉంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీలో ఆది చేరికను ఎలా చూస్తాడో చూడాలి. ఆదినారాయణ రెడ్డి సీఎం సొంత జిల్లా నేత, జమ్ములమడుగు నియోజకవర్గంతో అనుబంధం ఉన్నవారు. ఆదినారాయణ రెడ్డిబీజేపీలో చేరిక కడప రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపుతుందో..ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.?!!. ఆది చేరిక..రాయలసీమ జిల్లాల్లో టీడీపీ నేతలు బీజేపీలొ చేరికకు దోహద పడుతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో 53 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో వైఎస్ఆర్ సీపీ గత ఎన్నికల్లో 50 అసెంబ్లీ సీట్లు, 8 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. రాయలసీమ అంటే వైఎస్ఆర్ సీపీకి అత్యంత పట్టున్న ప్రాంతం. వైఎస్ఆర్ సీపీకి పట్టున్న చోట వలస నేతలతో బీజేపీ ప్రజల మనసు గెలుచుకోలగలదా..?

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story