టీడీపీకి గుడ్‌బై చెప్పిన సాధినేని యామిని 'ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్' ఏంటీ.?

By Medi Samrat  Published on  8 Nov 2019 9:08 AM GMT
టీడీపీకి గుడ్‌బై చెప్పిన సాధినేని యామిని ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ ఏంటీ.?

ముఖ్యాంశాలు

  • జగన్ తో పెట్టుకుని తప్పు చేసిందా.?
  • బీజేపీలోకి వెళుతుందా.?

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ సాధినేని యామిని రాజీనామాతో టీడీపీకి ఏం నష్టం.? టీడీపీని కాదని వేరే పార్టీలోకి వెళ్లి ఉండగలరా...? ఇప్పుడు అసలు ఆమె పార్టీ మారాల్సిన అవసరమేంటి...? ఎందుకు మారాల్సి వచ్చింది..? పార్టీ మారిన టీడీపీ కుటుంబసభ్యురాలిగా ఆమె.. అదే పార్టీని విమర్శించగలదా.. యామిని రాజీనామా తర్వాత రాజకీయవర్గాల్లో. ఈ ప్రశ్నలే చర్చనీయాంశమయ్యాయి.

సాధినేని యామిని టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా, లోకేశ్ కు సన్నిహితురాలిగా... పార్టీ వక్తగా మంచి పేరుంది. దానికి తగ్గట్టుగానే చిన్నసైజు హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న వైసీపీ, బీజేపీ, జనసేనలపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడింది. అదే స్థాయిలో విపక్షాలు కూడా కౌంటర్లు ఇచ్చేవి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అది అందరికీ తెలిసింది. ఉన్న 23 ఎమ్మెల్యేల్లో కూడా కొందరు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితులే సాధినేని యామిని పార్టీకి రాజీనామా చేశాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

లేదంటే.. టీడీపీ కీలక నేతలు సైతం వైసీపీ పాలనలో కేసుల పాలవుతున్నారని... మరికొందరు ఏకంగా జైలుకే పోతున్నారని... ఇలాంటి సమయంలో టీడీపీలో ఉంటే తనకు ఆ పరిస్థితులు తప్పవని యామిని భావించారనే చర్చ కూడా నడుస్తోంది. తప్పులు చేస్తే భయపడాలి...తప్పు చేయనప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నా... ఏమీ చేయలేదు కదా అనేది గుర్తు పెట్టుకోవాలి. ఆమె చిన్న పారిశ్రామికవేత్త కూడా. మరి ఆ కోణంలో తన వ్యాపారాలకు ఏమైనా హాని జరుగుతుందని భావించారా .... ఈ చర్చ కూడా నడుస్తోంది.

పార్టీ మార్పు నిజమైతే వైసీపీలో చేరే అవకాశమే ఉండదు. ఎందుకంటే తీవ్ర స్థాయిలో వైసీపీపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నా లేనట్టే. ఇక మరో పార్టీ జనసేన. ఆ పార్టీలో అసలు చేరలేదు. ఎందుకంటే పవన్ , జనసేనలను తీవ్రంగా విమర్శించిన వ్యక్తుల్లో యామిని ముందుంటారు. పవన్ కు పావలా కళ్యాణ్ అనే పేరు పెట్టినా.. పవన్ మంచం మీద మల్లెపూలు నలపడం తప్ప మరేమీ చేయలేడంటూ తీవ్రంగా విమర్శించి అప్పట్లో చర్చనీయాంశమయ్యారు.

అంతేకాదు.. జనసేన సైనికుల ట్రోలింగ్ కు కూడా గురయ్యారు. అది కాస్త పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కే వరకు వెళ్లింది. సో ఆ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లదు. ఇక యామిని ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ బీజేపీ మాత్రమే. వస్తున్న వార్తల ప్రకారం ఒక వేళ ఆమె బీజేపీలో చేరితే బీజేపీకి కలిగి ప్రయోజనమేంటి. అదో జాతీయ పార్టీ. రాష్ట్రంలో పరిస్థితి బాగోపోయినా... కేంద్రంలో ఉంది కాబట్టి కొంత చెల్లుబాటు అవుతుంది. యామిని అనుభవాన్ని బేరీజు వేసుకుని మహాగణంగా అయితే ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టవచ్చు. లేదంటే నటి కవితలాగానే ఉపాధ్యాక్ష పదవి అప్పగిస్తారేమో.

పార్టీ బాధ్యతలు తీసుకుంటే అధికార పక్షాన్ని బాగా విమర్శించాలి. అధికారపక్షాన్నే కాదు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని కూడా ఏకి పారేయాలి. అప్పుడే పార్టీలో తన పట్టు నిలుపుకోగలుగుతుంది. లేదంటే నలుగురితో పాటు నారాయణలా ఉండిపోవాల్సిందే. వైసీపీపై విమర్శలు చేయడానికి యామినికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ... కారణమేదైనా సరే అధికారపక్షం జుట్టు కొంత బీజేపీ చేతిలో ఉంది కాబట్టి. బీజేపీ అధికార ప్రతినిధిగా యామిని విమర్శించినా పెద్దగా వైసీపీ కౌంటర్ ఇవ్వలేదు అనేది కూడా నిజమే.

యామిని బీజేపీలో చేరితే ఆ పార్టీ నేతగా టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయగలదు అనేది ఆసక్తిని రేపుతోంది. టీడీపీకి ఫైర్ బ్రాండ్ లా మెలిగిన యామిని... టీడీపీని ఎలా విమర్శిస్తుంది అనేది అందరి మదిలోనూ మెదులుతుంది. టీడీపీకి యామిని రాజీనామా చేయడం వల్ల ఆ పార్టీకి పెద్దగా పోయేదేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలవలేదు. కేవలం మహిళా వ్యాపారవేత్తగా, కొంచెం గ్లామర్ ఉన్న వ్యక్తిగా, అన్నింటికీ మించి ఇంటిపేరును ద్రష్టిలో పెట్టుకుని మాత్రమే అధికారప్రతినిధి పదవి ఇచ్చారు అనేది కాదనలేని సత్యం.

పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లోకేశ్ కు కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. దీంతో ఆమెకు టీడీపీలో బాగా గుర్తింపు వచ్చింది. టీడీపీలో చెలరేగిపోయిన యామిని...ఇప్పుడు అదే పార్టీని ఎలా విమర్శిస్తారు అనేది అంతుపట్టడం లేదు. అసలు ఆ స్థాయిలో వైసీపీపై విమర్శలు చేయకపోతే.. ఇప్పుడు వైసీపీలో చేరే అవకాశం వచ్చేదేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తో పాటు, వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో.. పాపం ఆ ఛాన్స్ కూడా యామిని కోల్పోయిందని జాలి పడుతున్నారు కొందరు. జన్మనిచ్చిన పార్టీపై ఆరోపణలు ఎందుకులే అని ఊరుకుంటారో.. లేదంటే విమర్శలు గుప్పించి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తారో చూడాలి.

Next Story