జనతా కర్ఫ్యూ వల్ల ఫలితమేంటి..? కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చా..?
By Newsmeter.Network Published on 21 March 2020 11:30 AM ISTజనతా కర్ఫ్యూ.. ఇప్పుడు ఈ మాట భారత్ దేశం మొత్తం మారుమోగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశం మొత్తం ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు సిద్ధమైంది. శనివారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిచిపోనుండగా.. మిగిలిన రవాణా వ్యవస్థసైతం పూర్తిగా నిలిచిపోనుంది. భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 258కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం మధ్యాహ్నం సమయం వరకే పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ భారత్‌లో ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు హై అలర్ట్ ను ప్రకటించాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆదివారం దేశవ్యాప్తంగా ప్రజలంతా 14గంటల పాటు బయటకు రావద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
అయితే జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి..? జనతా కర్ఫ్యూ 14గంటలు ఉంటుంది. ఈ 14గంటల్లో వైరస్ విచ్ఛిన్నమవుతుందా అనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. 14గంటలు ప్రతీఒక్కరూ బయటకు రాకుండా ఉంటే కనీసం కరోనా వైరస్ వ్యాప్తిని కొంతమేరైనా అడ్డుకొనే అవకాశాలు ఉన్నాయి. కరోనా బతికుండే జీవితకాలం గరిష్ఠంగా 12గంటలు అని వైద్యులు సూచిస్తున్నారు. 12గంటలు ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా ఉంటే అది కొంతమేరైనా విఛ్చిన్నమవుతుందని పేర్కొంటున్నారు. దీనిలోనే భాగంగానే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ విధించారు. 14గంటల పాటు అందరూ ఇండ్లకే పరిమితమైతే గొలుసు కట్టుగా వ్యాపించే కరోనా వైరస్‌కు కొంతమేరైనా అడ్డకట్ట వేయవచ్చు. దీనిలో భాగంగానే ప్రధాని ఈ జనతా కర్ఫ్యూ ఆలోచన చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు సైంటిస్టుల వాదన ఒకలా వినిపిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ప్రిన్సిటన్ వర్శిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ , సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తదితర సంస్థల శాస్త్రజ్ఞలు కరోనా వైరస్‌పై పలు అధ్యయనాలు చేశారు. వీరి వాదన ప్రకారం.. కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై 2 నుంచి 3రోజులు, అల్యూమినియం, చెక్క, పేపర్‌పై ఐదు రోజులు, రాగి ఉపరితలంపై నాలుగు గంటలు, ప్యాకేజింగ్‌కు వాడే అట్టపెట్టెలపై 24 గంటలు అంటిపెట్టుకొని ఉంటుందని పేర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జనతా కర్ఫ్యూలో భాగంగా 14గంటలే కాక.. వైరస్ ముప్పు తగ్గే వరకూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించడం మంచిదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
దీనికితోడు కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వారి శరీరతత్వాన్ని బట్టి 4 నుంచి 14 రోజుల దాకా ఎలాంటి లక్షణాలూ కనపడవని, ఈ సమయంలో వారు క్యారియర్లుగా ఉంటారని, అంటే వారి నుంచి వైరస్ మరొకరికి పాకుతుందని, కాబట్టి ఆ 14గంటలే కాక, వైరస్ ముప్పు తగ్గే తగ్గేవరకు ప్రతీ ఒక్కరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని పిలుపులో భాగంగా ఆదివారం ప్రతీ ఒక్కరూ జనతా కర్ఫ్యూలో పాల్గొంటే వైరస్ వ్యాప్తిని కొంతమేరైనా అదుపు చేయగలమనేది ప్రతీఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశంగా పలువురు వైద్యులు సూచిస్తున్నారు.