హర్యానాలో ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, INLD. ఐతే ఈ రెండు పార్టీలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కూడా ఆ 2 పార్టీలను దారుణంగా దెబ్బతీసింది. ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి అసెంబ్లీ సమరంలో ఈ పార్టీలు ఎంత మేరకు పుంజుకుంటాయన్నది ఆసక్తికరం.

హర్యానాలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. భూపీందర్ సింగ్‌ హుడాపైనే ఆశలు పెట్టుకుంది హైకమాండ్. హుడా నేతృత్వంలోనే 2014 ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. 40 నుంచి 15 స్థానాలకు పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది హైకమాండ్. పార్టీలో పలు కీలక మార్పులు చేశారు. కుమారి షెల్జాను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు కిరణ్ చౌధరీకి మేనిఫెస్టో బాధ్యతలు అప్పగించారు. హుడా-షెల్జా-కిరణ్ త్రయాన్ని ముందుపెట్టి పార్టీ నేతలంతా ఒకేతాటిపై ఉన్నారనే సందేశాన్ని పంపింది.

ఐఎన్ఎల్డీ పరిస్థితి దారుణం

ఇక రైతు పార్టీగా పేరొందిన ఐఎన్‌ఎల్‌డీ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఒకప్పుడు హర్యానాలో అధికారం చేపట్టి, తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. గత ఐదేళ్లలో పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. కుటుంబ కలహాలతో నిలువునా చీలిపోయింది. మాజీ ఉప ప్రధాని, దివంగత దేవీలాల్ స్థాపించిన ఈ పార్టీ గతంలో హర్యానాలో చక్రం తిప్పింది. దేవీలాల్ వారసుడు ఓమ్ ప్రకాష్ చౌతాలా కుటుంబంలో వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. పెద్ద కుమారుడు అజయ్ చౌతాల పార్టీ నుంచి విడిపోయి తన కుమారులతో కలసి JJP-జన్ నాయక్ జనతా పార్టీ పేరిట కొత్త పార్టీ స్థాపించారు. ఈ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో INLD 19 సీట్లు గెల్చుకుంది. కానీ ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి. అజయ్ చౌతాల స్థాపించిన కొత్తపార్టీలోకి నలుగురు వెళ్లిపోగా, మిగిలిన 10 మంది కషాయతీర్థం పుచ్చుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో INLD అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు.. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి పార్టీని బయటపడేయడం ఇప్పుడు ఓపీ చౌతాల ముందున్న అతిపెద్ద సవాల్.

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బీఎస్పీ, జేజేపీ

ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, INLD పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటే మిగతా చిన్నాచితక పార్టీల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. BSP, JJP, అకాలీదళ్, లోక్‌తంత్ర సురక్ష పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఒకటి రెండు స్థానాల్లోనైనా గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీతో కలిసి జేజేపీ సీట్ల సర్దుబాటు చేసుకుంది. రెండు పార్టీలు కలిసి 9% ఓట్లు సాధించాయి. ఇక బీఎస్పీ, అకాలీదళ్‌కు ఒక్కో ఎమ్మెల్యే చెప్పున ఉంటే వాళ్లిద్దరూ కూడా బీజేపీ చేరారు.

మొత్తానికి హర్యాన కురుక్షేత్రంలో ప్రస్తుతానికి కమలానిదే పైచేయిగా కనిపిస్తోంది. మరోసారి అధికారంలో వచ్చే అవకాశలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్, INLD కలిసి మ్యాజిక్ మార్క్ సాధిస్తే తప్ప బీజేపీకి ఎదురులేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.