వెస్టిండీస్‌ క్రికెటర్‌ స్వీయ నిర్బందం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2020 10:06 AM GMT
వెస్టిండీస్‌ క్రికెటర్‌ స్వీయ నిర్బందం..

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ముప్పులో దాదాపు అన్ని క్రీడా టోర్నీలు రద్దు అయ్యాయి. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడేందుకు వెస్టిండిస్‌ క్రికెటర్‌ డారెన్‌ సామీ వెళ్లాడు. అయితే.. టోర్నీ మధ్యలో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌కు కరోనా లక్షణాలు బయటపడడంతో టోర్నీని రద్దు చేశారు. అలెక్స్‌ హేల్స్‌ను ఆగమేఘాలపై ఇంగ్లాండ్‌కు పంపిన పాకిస్థాన్‌.. టోర్నీలో ఆడుతున్న విదేశీ క్రీడాకారులకు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించింది. 128 మంది క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా వారందరికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని స్వదేశాలను పంపించింది.

ఈ క్రమంలో పాకిస్థాన్‌ నుంచి వెస్టిండిస్ చేరుకున్నాడు డారెన్‌ సామీ. ప్రభుత్వ ఆదేశాలకి అనుగుణంగా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సామీ వెల్లడించాడు. విదేశాల నుంచి వచ్చిన వారు కనీసం రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశాల ప్రభుత్వాలు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన్పటికి.. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు డారెన్ సామీ తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో డారెన్ సామీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన సామీ 44 పరుగులు చేసి.. ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. కాగా.. ఇటీవల అతనికి పాకిస్థాన్ గౌరవ పౌరసత్వం లభించిన విషయం తెలిసిందే.

Next Story