తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
Weather updates in Telugu States thunderstorm alert for north andhra districts.తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2022 9:54 AM ISTతెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు జలమమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయాలు కలిగాయి. దీంతో ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీని వల్ల ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, వర్షం కురుస్తున్న సమయంలోప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరించింది.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాం విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస మండలాలకు పిడుగు సూచన ఉంది.
అటు తెలంగాణలో సైతం సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సూచించారు. ఇక రాష్ట్రంలో నేడు(మంగళవారం) సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 20, 2022