మే 31 వరకూ తెలంగాణలో వాతావరణం ఇలా ఉండనుందా?

కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

By M.S.R  Published on  27 May 2024 1:37 PM IST
Telangana, weather,  imd,

మే 31 వరకూ తెలంగాణలో వాతావరణం ఇలా ఉండనుందా?

మే 31 శుక్రవారం వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే శుక్రవారం వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాతావరణ శాఖ ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం, జగిత్యాల, పెద్దపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది.

ఆదివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, మరో డ్రైవర్ చనిపోయారు. హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్ల కొమ్ములు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి.

Next Story