తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే చాన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.
By Srikanth Gundamalla
తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే చాన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో అయితే.. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు ఎండ వేడిమితో నానా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో కూడా వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
కరీంనగరన్ జిల్లా జమ్మికుంట మండలంలో అధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2 డిగ్రీలు, ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 44.5 డిగ్రీల నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని మూసాపేటలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇక ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయనీ.. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆది, సోమవారాల్లో ఎండ తీవ్రత ఉన్నా కూడా.. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇక చినుకు పడితే వాతావరణం కాస్త చల్లబడుతుందనీ.. ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు వడదెబ్బ కారణంగా శనివారం రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.