తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 1:19 AM GMTతెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి రుతుపవనాలు దేశంలో తీరాన్ని దాటాయి. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా గత మూడు రోజులుగా వాతావరణం చల్లగానే ఉన్నా.. చినుకు జాడ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది.
ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతాచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి సహా హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. రాజధాని నగరంలో రాత్రి చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలే మరో మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
కాగా.. ఆదివారం జయశంకర్ జిల్లా చేల్పూరులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిరిసిల్ల జిల్లా నెరెళ్లలో 4.6 శాతం వర్షపాతం, భూపాపల్లిలో 4.4 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. నిర్మల్ కద్దం పెద్దూరులో 4.2, భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్‌లో 3.9, సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో 3.9, మంచిర్యాల జిల్లా భీమారంలో 3.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.