తెలంగాణకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Srikanth Gundamalla Published on 10 July 2023 5:19 AM GMTతెలంగాణకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ
వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులు అవుతోంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా మాత్రం వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. ఈ నేపత్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. ఆదివారం రాత్రి ఐదు రోజుల తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక జూలై 13, 14 తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్ మంచిర్యాల, మహబూబాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 15వ తేదీన కూడా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురస్తాయని వివరించింది. హైదరాబాద్‌లో ఇవాళ మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. సాయంత్రం, రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ కేంద్రం. జూలై 9న ములుగు జిల్లా వెంకటాపురంలో 55.2 మి.మీ వర్షాపాతం నమోదైంది. ములుగులో 47.2, సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 48.8 మి.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో 38.6 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఆదివారం నల్లగొండలో అధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.