తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  24 Nov 2023 1:05 AM GMT
telangana, rain, weather report,

తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం నుంచి తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు మరో మూడ్రోజుల పాటు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు వర్షాలు పడతాయని.. అయితే భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశాలు లేవని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం వేళ మంచు ఉంటుందని వివరించింది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అధికంగా నల్లగొండ జిల్లా దామరచర్లలో 2.7 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మెదక్‌లో 17 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అందువల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వివరించారు.

మరోవైపు హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దాంతో.. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసులకు వెళ్లి తిరిగి వస్తుండగా వర్షంలో ఇరుక్కుపోయి వానలో తడిచారు. నీళ్లు రోడ్లపై నిలవడం వల్ల పలుప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, ఎర్రగడ్డ, మెహదీపట్నం, కూకట్‌పల్లి, పటాన్‌చెరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో నగర వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story