తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు: వాతావరణ కేంద్రం
వచ్చే మూడ్రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని..
By Srikanth Gundamalla
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు: వాతావరణ కేంద్రం
జూన్ నెల చివరి వారం కూడా వస్తోంది.. కానీ వర్షాల జాడ మాత్రం లేదు. వర్షాలు ఏమో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. ఠారెత్తిస్తున్న ఎండలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.
వచ్చే మూడ్రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని చెప్పింది. ఇక అదే సమయంలో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే.. మంగళవారం సాయంత్రమే పలు చోట్ల ఉరుములతో స్వల్పంగా వర్షాలు కురిశాయి. జూన్ తొలి వారంలోనే పడాల్సిన వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందారు. తాజాగా వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు కాస్త కుదుట పడ్డారు. వర్ష ప్రభావం ఎక్కువున్న జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేశారు.
ఇక నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో దక్షిణ భారత దేశమంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో.. విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కూడా వేడిమి నుంచి ఉపశమనం పొందనున్నారు.