తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
By Srikanth Gundamalla
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాలు కురవడంతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే వర్షం మొదలైంది. చాలా ప్రాంతాల్లో పూర్తిగా మేఘావృతమై ఉంది. గత రెండుమూడు రోజుల నుంచి ఎండ ఉన్నా.. మళ్లీ మేఘాలు కమ్ముకుని వర్షం మొదలైంది. ఇక సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.