తెలంగాణలో మోస్తారు వర్షపాతం నమోదు..నేడు, రేపు కూడా..
దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 1:41 AM GMTతెలంగాణలో మోస్తారు వర్షపాతం నమోదు..నేడు, రేపు కూడా..
తెలంగాణలో కొద్దిరోజుల నుంచి వర్షాలే లేవు. పైగా ఎండ కూడా కొద్దిరోజులు దంచి కొట్టింది. దాంతో.. ఇది ఎండాకాలమా అనే ఫీలింగ్ కలిగించింది ప్రజలకు. దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు 19న వర్షాలు కురిశాయి. మోస్తారు వర్షపాతం నమోదు అయ్యింది. అల్పీపడన ప్రభావంతో ఇవాళ, రేపు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భూపాలపల్లి జిల్లా చేల్పూర్‌లో 7.95 సెం.మీ వర్షపాతం, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. భూపల్లి జిల్లా మహాదేవపూర్‌లో 5.76 సెం.మీ వర్షం కురిసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6 సెం.మీ, ఏటూరునాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీనంగర్ జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ మహానగరంలో తేలికపాటి వర్షం కురిసింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది.
వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. రెండు,మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర చత్తీస్‌గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో రాబోయే రెండ్రోజులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో పరిస్థితులను పరీక్షించాలంటూ ఆదేశించారు.