తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 1:49 AM GMTతెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయువ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. శనివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో వాయుగుండంగా కూడా మారొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇవాళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రేపు కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడే చాన్స్ ఉంది. ఎల్లుండి జగిత్యాల జిల్లా, సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇప్పటికే అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.