తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 7:01 AM ISTతెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటోంది. ఈ క్రమంలోనే వాతావరణ కేంద్రం మరోసారి వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు.
సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాల,ద్, మంచిర్యా నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండ్రోజుల్లో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిద్దిపేట అర్బన్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్ , తమిళనాడు , బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆలయాల లోకి వరదనీరు చేరింది. చత్తీస్‌గడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు- కర్నాటక సరిహద్దులో వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.