తెలంగాణకు వర్ష సూచన, 13 జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla
తెలంగాణకు వర్ష సూచన, 13 జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు విస్తారంగా కురుస్తాయని చెప్పారు. జూలై 18వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శనివారం నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని.. వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు.
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా నగరంలోని రహదారులు వరదమయం అయ్యాయి. వాహనదారులు స్వల్ప ఇబ్బంది పడ్డారు.