తెలంగాణలో ఐదు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ

తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2024 7:37 PM IST
Telangana, rain alert, weather,

తెలంగాణలో ఐదు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ 

తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. దాంతో భారీ వరద పోటెత్తింది. రోడ్లు జలమయం అయ్యాయి. హుస్సేన్ సాగర్‌ పూర్తిగా నిండిపోయింది. నగరంలో పలు చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి. ఈక్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు కీలక సూచనలు చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలను ఆనుకొని దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులోఉన్న ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్‌తో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ తో పాటు జగిత్యాల, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌తో పాటు యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, జగిత్యాల, నల్గొండ, నారాయణపేట, సిద్దిపేటలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అధికంగా యాదాద్రి భువనగిరిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. నందనంలో 12 సెం.మీ, వనపర్తి జిల్లా కనాయిపల్లిలో 11.7 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది.

Next Story