Telangana: అతిభారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 July 2024 6:33 AM ISTTelangana: అతిభారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిభారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో పలు గ్రామాలు మునిగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో చాలా గ్రామాలను వరద పోటెత్తింది. గుడిసెలు కూలిపోయాయి. నిరాశ్రయులైన వారు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రెండుమూడు రోజులు అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం సమద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల్లో బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయి.