తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
By Srikanth Gundamalla
తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గురువారం నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, టోలిచౌకి, అత్తాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఇక ఇదే బుధవారం కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది
భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు భద్రాచలం పట్టణం మొత్తం జలదిగ్భందం అయ్యింది. మంగళవారం కురిసిన కుండపోతతో రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. భద్రాద్రి పట్టణంలోకి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం గోదావరి నది 33 అడుగుల వద్ద ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. నదీ ప్రవాహం 53 అడుగులకు చేరి అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయిన సమయంలోనూ పట్టణంలోకి నీరు చేరలేదు. కానీ ప్రస్తుతం గోదావరి బ్యాక్ వాటర్ పట్టణంలోకి వచ్చి చేరుతుంది.