తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
తాజాగా రాష్ట్రంలో వర్షాలు పడటంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 2:31 AM GMTతెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో వాతావరణం కాస్త చల్లగానే ఉన్నా.. వర్షాలు మాత్రం అన్ని ప్రాంతాల్లో కురవడం లేదు. తాజాగా రాష్ట్రంలో వర్షాలు పడటంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నాలుగు రోజుల పాటు కురుస్తాయని వెల్లడించింది. విస్తారంగా నాలుగు రోజులు వర్షాలు ఉండటంతో ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా భారీగా ఈదురుగాలలు వీస్తాయనీ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
నేడు ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ.. ఉదయం మేఘాలు కమ్ఏసి సాయంత్రానికి వర్షాలు పడొచ్చని చెప్పారు. మేఘాల కారణంగా తీవ్ర ఉక్కపోత ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో పగటివేళ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సీయస్ ఉంటుందని అంచనా వేశారు.
అయితే.. రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే బయటకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.